May 11,2023 22:52

ప్రజాశక్తి - నందిగామ : మహిళా, శిశు సంరక్షణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని స్థానిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన అంగన్వాడి కార్యకర్తలకు శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్‌ కుమార్‌ గురువారం రాత్రి నియామక పత్రాలను అందజేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అంగన్వాడి వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్‌ వాడీ లకు వేతనాలు పెంచిన ఘనత జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కిందని తెలిపారు. అంగనవాడి కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించడంతో పాటు ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. అంగన్‌ వాడీ కార్యకర్తలు గ్రామాలలో తిరుగుతూ గర్భిణీలు, బాలింతలను గుర్తించి పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సిడిపిఓ పి.కష్ణకుమారి, సీనియర్‌ అసిస్టెంట్‌ జెస్సి, స్థానిక వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు .