Jun 11,2023 21:12

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిఎస్‌పి కేశప్ప

మదనపల్లె అర్బన్‌ : మండలంలో ఈనెల 9 వ తేదిన మహిళను హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డిఎస్‌పి కేశప్ప తెలిపారు . ఆదివారం డిఎస్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం, కోలార్‌ జిల్లా, ములభాగల తాలూకు, రాజేంద్రనహళ్లి పోస్టు, చికూరు గ్రామానికి చెందిన శంకర్‌రెడ్డి ఇతని భార్య అక్కగాళ్ల లక్ష్మీదేవమ్మలు కొన్ని సంవత్సరాల క్రితం జీవన ఉపాధికై రామసముద్రం మండలం, కెసిపల్లి పంచాయతీ ప్రకాష్‌రెడ్డి కులాల వద్ద కాపులాదారులుగా ఉంటున్నారు. అయితే వీరి కుమార్తె ధనలక్ష్మిని చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లి కి చెందిన రెడ్డప్పకు ఇచ్చి వివాహం చేశారు. ఐదు సంవత్సరాల క్రితం రెడ్డప్ప అనారోగ్యంతో మతి చెందడంతో ధనలక్ష్మి అంగన్వాడీ వర్కర్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో రామసముద్రం మండలం, అరికెల పంచాయితీ, గోసువారి పల్లికి చెందిన సుబ్రమణ్యంరెడ్డి కుమారుడు మల్లకుంట్ల అంజనీకుమార్‌రెడ్డికి శంకర్‌రెడ్డి కుమార్తె ధనలక్ష్మి కి ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమై ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్ని రోజులుగా సహజీవనం సాగించాడు. నగంగా వున్న విడియోలు తీసి ధనలక్ష్మి తల్లిదండ్రులకు చూపించి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడం జరిగిందని తెలిపారు. నగంగా వున్న వీడియోలను సామాజిక మాధ్యమాలలో పెట్టడంతో గతంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతనిపై చౌడేపల్లి పోలీస్‌ స్టేషన్లో నాలుగు సార్లు కేసు నమోదు చేసి రిమాండ్‌ కూడా తరలించినట్లు తెలిపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇదంతా ధనలక్ష్మి తల్లిదండ్రులు చేస్తున్నారని కక్షగట్టి ఈనెల 9 వ తేదిన శంకర్‌రెడ్డి ని హత్య చేయాలని నిర్ణయించుకుని కత్తి తీసుకుని వచ్చాడు. అక్కడ శంకర్‌రెడ్డి లేక పోవడంతో లక్ష్మీదేవి గొంతు కొసి హత్య చేసి పరారైయ్యాడు. కుమార్తె గువ్వల ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఆదివారం పుంగనూరు అంబేద్కర్‌సర్కిల్‌ వద్ద అనుమానాస్పదంగా తిరు గుతున్న అంజనీకుమార్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎస్‌పి గంగాధర్‌రావు ఆదేశాల మేరకు హత్య జరిగిన 24 గంటల్లోనే రూరల్‌ సర్కిల్‌ సిఐ శివాం జనేయులు, ఎస్‌ఐ, పోలీస్‌ సిబ్బంది కేసును చేదించడం జరిగిందని తెలిపారు.