ప్రజాశక్తి -కందుకూరు :మండలంలోని మహదేవపురం సచివాలయ పరిధిలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి నిర్వహించారు. మహీధర్ రెడ్డి ప్రతి ఇంటింటా తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అర్హత ఉండి రాని పథకాలు ఏమైన ఉంటే తెలియజేయాలన్నారు. కాకిబంగారుపాలెంలో కాలువపై మూత బండలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరారు. భూ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వర్షాలు పడినప్పుడు వాగుపై నుంచి రాకపోకలు సాగించాలంటే ఇబ్బందిగా ఉన్నందున తూములు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. అనంతరం సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో సచివాలయం వద్ద సమీక్ష నిర్వహించారు. ఎంపిడిఒ పి.విజయశేఖర్, తహశీల్దార్ డి. సీతారామయ్య, సర్పంచ్ కె పద్మ, ఎంపిటిసి ఎం. ఝాన్సీ, వైసిపి నాయకులు ఇంటూరి మాధవరావు, తొట్టెంపూడి శ్రీనివాసరావు, గుళ్ళ శ్రీనివాసులు, ఇంటూరి హరిబాబు ,గంగవరపు వెంకటరావు, సూరం వేణు గోపాలరెడ్డి, సర్పంచ్‌లు ఆవుల మాధవరావు, కుమ్మర బ్రహ్మయ్య, మహదేవపురం ఉప సర్పంచ్ నర్రా వెంకటేశ్వర్లు, కార్యదర్శి స్వప్న ఉన్నారు.










