కుర్రాడు పుట్టింది సామాన్య రైతుకుటుంబంలో... చదివింది హైస్కూలు చదువే... పని ఓడ కార్మికుడుగా...కాని తనకంటే ఎక్కువ చదువుకున్నవారిని, పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఆకట్టుకున్నాడు. ఆశయాలు నూరిపోశాడు. కర్తవ్యోన్ముఖులను చేశాడు. ఆయనే అమీర్ హైదర్‌ఖాన్.
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమాన్ని స్మరించుకునే సందర్భంలో దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బీజాలు వేసిన అమీర్ హైదర్‌ఖాన్‌ను స్మరించుకోకుండా ముందుకు సాగలేము. ఆయన స్వయంగా చెప్పుకోదగ్గ ఏ ఉద్యమాలూ నిర్వహించలేదు. అయినా ఆయన దక్షిణ భారతదేశ ఉద్యమ సృష్టికర్తల్ని అందించారు. ఆయన 1900లలో పంజాబ్ రాష్ట్రంలోని కలియన్ వలియన్ గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమంలో పనిచేస్తున్న తన అన్నను వెతుక్కుంటూ అమీర్ హైదర్‌ఖాన్ తన 15వ ఏట బంబాయి చేరాడు. ఓడ కార్మికుడుగా, పేపర్ బారుగా, మోటారు మెకానిక్‌గా పనిచేశాడు. విమాన పైలట్‌గా, మెరైన్ ఇంజనీరుగా కూడా తర్ఫీదు అయ్యాడు. పనిచేసుకుంటూనే ఆయన అమెరికా, జపాన్, సోవియట్ యూనియన్ వంటి దేశాలకు వెళ్లాడు. గదర్ పార్టీతో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ దశలో ఆంగ్లేయ సిఐడిల నుండి తప్పించుకొని అమెరికా వెళ్లాడు. అమెరికన్ వర్కర్స్ పార్టీ సభ్యుడయ్యాడు. వారి సహకారంతో మాస్కోలోని ప్రాచ్య దేశాల విశ్వవిద్యాలయంలో మార్క్సిస్టు సిద్ధాంత శిక్షణ పొందాడు. అంతర్జాతీయ సంస్థ కొమిరిటరన్‌తో సంబంధాలు ఏర్పరుచుకొని వారి సహాయంతో దక్షిణ భారత దేశం చేరి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి నడుం కట్టారు.
ఉద్యమ నిర్మాణంలో అమీర్‌హైదర్ ఖాన్‌ది ఒక విశిష్ట శైలి. ఆయన నేరుగా ఉద్యమాలు నిర్మించే పనికి దిగలేదు. విలువైన వస్తువులు కొని విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారిగా ఆయన మద్రాస్‌లో మకాం వేశారు. మద్రాస్ రైల్యే ఉద్యోగి మాత్యూ, ఆయన కింద పనిచేసే అప్రెంటీస్ వెంకట్రామన్‌తో పరిచయాలు పెంచుకున్నారు. వీరి ద్వారా మరికొందరు మిత్రులయ్యారు. పరిచయం అయిన ఎవ్వరితోనూ అమీర్ హైదర్ ఖాన్ రాజకీయాలు మాట్లాడలేదు. బ్రిటీష్ ప్రభుత్వం కింద చేసే ఉద్యోగాన్ని, ఉద్యోగం తాలూకూ బాధల్ని తెలుసుకుంటూ వాటిపైనే చర్చించేవారు. ఆ తరువాత దశలో పాలనా విధానాలకు, వారి బాధలకు ఉన్న సంబంధాన్ని, అందులో రాజకీయ విధానాల పాత్రనూ చర్చిస్తూ ఒక చిన్న కమ్యూనిస్టు గ్రూపును కూడగట్టారు. ఆ తరువాత స్వాతంత్రో ద్యమంలో చదు వు మానేసిన విద్యార్ధుల బోగట్టాను సంపాదించి వారితో పరిచయాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే కంభంపాటి సత్యనారాయణతో పరిచయమైంది. ఆయన కుటుంబాన్ని మద్రాసుకు మార్పించారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాత్రదారుడ్ని చేశారు. బెంగుళూరులో సుందరయ్య గారి గురించి విని ఆయనను కలిశారు. ఆయననూ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఒప్పించారు. ఇదే కాలంలో డాక్టర్ అచ్చమాంబతోనూ పరిచయం పెంచుకున్నారు.
వీరందరినీ యంగ్ వర్కర్స్ లీగ్‌కింద సమీకరించి సిద్ధాంత అధ్యయానికి పురమాయించారు. అప్పటికే ఆయన ప్రత్యేకంగా సంపాదించిన 'రాజ్యాంగ యంత్రం, విప్లవం'పై మార్క్స్ పుస్తకాలను చదివించారు. ఒక్కొక్క సభ్యునితో ఒక్కొక్క పేరా చదివిస్తూ దానిపై మరొకరితో వివరణ ఇప్పించేవారు. ఆ వివరాలను నిత్య జీవితానికి జోడిస్తూ అమీర్‌హైదర్ ఖాన్ అనేక ఉదాహరణలు ఇచ్చేవారు. ఇందుకోసం ఆయన ఇంగ్లీష్, తమిళ భాషల్లో కనీసార్హత సాధించారు. ఒక్కోసారి ఫ్యాక్టరీల వద్దకు తీసుకెళ్లి అక్కడి కార్మికుల స్థితిగతుల్ని చూసి మార్క్స్ బోధనలకూ వాస్తవ పరిస్థితికీ, జీవితానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించి చెప్పేవారు. పనివేళలు పూర్తయ్యాక ఫ్యాక్టరీ నుండి వెలుపలికొచ్చే కార్మికులను చూపుతూ 'మార్క్స్ పేర్కొన్న కార్మిక సైన్యం' అంటూ విప్లవ సాధనలో దాని అనివార్య పాత్రను విశ్లేషించేవారు. ఇలాంటి కార్యక్రమాల్లో ఉండగా పోలీసులు అమీర్ హైదర్ ఖాన్ జాడ గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఆయన కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ బాధ్యతను సుందరయ్య గారికప్పగించి మాస్కో వెళ్లాడు. ఆకలిని జయించే జీవన సమరంలో అమీర్ హైదర్‌ఖాన్ కమ్యూనిస్టు కావడమే కాక సుందరయ్య, కంభంపాటి, అచ్చమాంబలాంటి విద్యాధికుల్ని కమ్యూ నిస్టులుగా మార్చారు.










