ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :నేదు అంతర్జాతీయ మహిళా దినోత్సం. రాజకీయనేతలు, అందరూ ఈ ఒక్కరోజు మహిళల గురించి పెద్దగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు వంట ఇంటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు సమాజంలో సగభాగమైంది. కేవలం 30ఏళ్ల కాలంలోనే ఎంతో మార్పు వచ్చింది. ఆడబిడ్డ సైకిల్‌తొక్కితేనే చిత్రంగా చూసే చోట, స్కూటర్, ఆటో, కారు, విమానాలు, రైళ్లతోపాటు అంతరిక్షలోనూ అవలీలగా అడుగు పెడుతోంది. పురుషునితో సమానంగా అవకాశాలు అంది పుచ్చుకుంటుంది. ఇంత ఎత్తు ఎదిగినా ఒక్క విషయంలో మాత్రం ఇంకా వెనుకనే ఉంది. పసిపాప, చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా మహిళలపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో నిర్భయ సంఘటన జరిగిన తరువాత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంతోనైనా మగవారిలో మార్పు వస్తుందని అందరూ ఆశపడ్డారు. చట్టాలు సక్రమంగా అమలు జరగకపోవడంతో ఇంకా దాడులు పెరుగుతున్నాయి. బుజబుజ నెల్లూరులో వరుసకు మామ అత్యాచారయత్నం చేసి, యాసిడ్ పోశారు. చెన్నరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి తుది శ్వాసవిడిచింది. నెల్లూరులో మూడేళ్ల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 70 సంవత్సరాల అవ్వపై మరో వ్యక్తి అఘాయిత్యాం చేశారు. ఇది మహిషి విషక్షణ కోల్పోయి చేస్తున్న తప్పుకన్నా మద్యం, గంజాయి, వంటి మత్తుపదార్థాలు మరో కారణంగా చెప్పొచ్చు. చట్టాలు కఠినంగా అమలు జరగకపోవడంతో ఇలాంటి తప్పులు జరగుతూనే ఉన్నాయి. మహిళ అర్ధరాత్రి తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం అని బాపూజీ కలలు కన్నారు. పట్టపగలే రోడ్లపై తిరిగే పరిస్థితులు కనిపించడం లేదు. మహిళల్లో చైతన్యం రావాలి, తమను తాము కాపాడుకునేలా తయారు కావాలి. అప్పుడే మహిళ స్వేచ్ఛగా, ధైర్యంగా సమాజంలో తిరగ గలదు.
కూలీలోనూ వివక్షతే..
మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒకే పని ఇద్దరు చేస్తే వేర్వేరుగా కూలీలు ఇవ్వడంలోనూ మహిళలను చిన్న చూపు చూస్తున్నారు. జిల్లా వ్యాపితంగా వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర చాలా పెద్దది. నారేతలు, కలుపు తీయడం, పైరు కోయడం, వంటి అన్ని పనుల్లో మహిళలున్నా పురుషులతో సమానంగా కాకుండా తక్కువ కూలీలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. నెల్లూరు నగరంలో కేవలం షాపుల్లో పనిచేసే మహిళలే సుమారు ఐదు వేల మంది వరకు ఉంటారు. వీరు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తున్నా అతి తక్కువ జీతం ఇచ్చి మహిళల శ్రమను దోచుకుంటున్నారు. కనీసం పది నిమిషాలు కూర్చోడానికి అవకాశం లేకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారు. భవన నిర్మాణ రంగంలోనూ మహిళలు ప్రధానంగా ఉన్నారు. కూలీ పనుల్లో తేడా కనిపిస్తోంది. పురుషులతో సమానంగా వేతనం ఇవ్వడం లోనూ వివక్ష చూపుతున్నారు.
భర్త వెనుకేలా.. ముందుకురారా..!
రాజకీయంగా మహిళలు ముందుకు రావాలని అందరూ కోరుకుంటారు. అనేక రంగాల్లో ముందున్నారు. రిజర్వేషన్లు కారణంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సగం మంది మహిళలు ఎన్నికయ్యారు. జెడ్‌పి ఛైర్మన్, మేయర్, ఎంపిపి, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, సర్పంచ్‌లు సుమారు 8500 మంది ఎన్నికైతే. అందులో 4,250 మంది మహిళలు ఎన్నికయ్యారు. మంచి పరిణామం. ఇప్పటికీ భర్తచాటు భార్యలుగానే పాలన సాగిస్తున్నారు. కుర్చీల్లో ఉంటున్నారు తప్ప, పాలన విషయంలో భర్తలు పెత్తనం చేస్తున్నారు. ఇది మారాలి. మహిళలకు పాలనలో స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే మహిళ మున్ముందుకు ఎదుగుతోంది..










