పేరు : రేణూ దేశాయ్
జననం : 1981, డిసెంబర్ 4
పుట్టిన ప్రదేశం : పూణే, మహారాష్ట్ర
వృత్తి : మోడల్, నటి, కాస్ట్యూమ్ డిజైనర్
హాబీస్ : రీడింగ్, రైటింగ్, యోగా, ట్రావెలింగ్
పిల్లలు : అకీరా నందన్, ఆద్య
సీనియర్ నటి, మోడల్, కాస్ట్యూమ్ డిజైనర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తన పిల్లల గురించి, తన గురించి ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతిపై ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా ఆమె స్పందించారు.
కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఉధృతమవుతోంది. హాస్పిటల్లో బెడ్స్ దొరకడం లేదు. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి తన వంతు సాయం చేస్తానంటున్నారు రేణూ దేశాయ్. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ''సోషల్ మీడియాను సినిమా ప్రమోషన్ కోసం వాడుకునే వాళ్లు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతుండటం సంతోషం'' అన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటినుంచి ఓపెన్‌లోనే ఉంటుందని తెలిపారు. సహాయం అవసరమైన వారు తన ఇన్‌బాక్స్‌లో మెసేజ్ చేయాలని కోరారు. ''ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు.. వంటివి అవసరం ఉంటే నాకు మెసేజ్ చేస్తే, సహాయం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ చేయండి. గతంలోని కొన్ని చేదు అనుభవాల రీత్యా ఆర్థిక సహాయం మాత్రం చేయలేను'' అని పేర్కొన్నారు.
సురక్షితంగా ఉండండి..
మరొక పోస్టులో- కోవిడ్ బాధితుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అయ్యింది. ''బాధలు ద్వేషం వంటివి మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కేవలం బాధపడటానికే ఈ శరీరం లేదు కదా? బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందంగా జీవించాలి. మనం ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏది అవసరమో అది చేయాలి'' అని భావోద్వేగం వ్యక్తపరిచారు.
''సంతోషంగా ఉండడానికి స్టాండప్ కామెడీ వీడియోలు చూడండి. క్యూట్ పప్పీల వీడియోస్ చూడండి. ఈ కష్టకాలం ఎక్కువ రోజులు ఉండదు. వెళ్లిపోతుంది.. పోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పతనం. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి'' అని కొన్ని సూచనలూ ఇచ్చారు రేణు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ పోస్టుకు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
చాలా అంశాలపై సున్నితంగా స్పందించే రేణు పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్ 4న జన్మించింది. మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ తరువాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం రేణు నటన నుంచి విరామం తీసుకున్నారు. అనంతరం ఇష్క్ వాలా లవ్‌తో దర్శకురాలిగా, ప్రొడ్యూసర్‌గా మారారు.