కడప అర్బన్ : తెలుగు నాటక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మేటి నాటకకర్త కోలాచలం శ్రీనివాసరావు అని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఆదివారం కోలాచలం 170వ జయంతిని నిర్వహించారు. చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో నాటక వికాసానికి బళ్ళారి కేంద్రమైందని, ధర్మవరం రామకష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు నాటక వికాసానికి కారకులని అన్నారు. వీరిద్దరూ సమకాలికులని, ధర్మవరం వారు ఆంధ్రనాటక పితామహుడని కీర్తింపబడగా, కోలాచలం ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడుగా కొనియాడబడ్డారన్నారు. మరాఠీ నాటక ప్రభావంతో నాటక రచనకు పూనుకొన్నారని చెప్పారు. ఆయన 30కి పైగా నాటకాలు రాశారని, అందులో రామరాజు చరిత్ర, ప్రతాపాక్బరీయం వంటి చారిత్రక నాటకాలతోపాటు పాదుకాపట్టాభిషేకం, లంకాదహనం వంటి పౌరాణిక నాటకాలున్నాయని అన్నారు. కోలాచలం నాటకాల్లో ప్రధానపాత్రలను బళ్ళారి రాఘవ పోషించి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచ నాటకరంగ చరిత్రను మొదటిసారిగా ఆంగ్లభాషలో రచించి, విశ్వవిజ్ఞాన వేదిక ముందు తెలుగువారి ఘనతను చాటిన గొప్ప రచయిత కోలాచలమన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకష్ణ శాస్త్రి మాట్లాడుతూ కోలాచలం వారికి వేదాలు, భగవద్గీత అభిమాన గ్రంథాలని, ఆయన వేదకాలం నాటి సాంఘిక పరిస్థితుల గురించి అనేకవ్యాసాలు రాశారని అన్నారు. గ్రంథపాలకులు ఎన్.రమేశ్‌రావు మాట్లాడుతూ కోలాచలంకు కడపతో అనుబంధం ఉందని, 1917లో కడపలో జరిగిన ఆంధ్ర సాహిత్య పరిషత్ సభకు అధ్యక్షత వహించారని తెలిపారు. రచయిత కొత్తపల్లి రామాంజనేయులు మాట్లాడుతూ షేక్‌స్పియర్ ప్రభావం కోలాచలంపై చాలా ఉందని చెప్పారు. పాఠకుడు జి.రంగ మాట్లాడుతూ కోలాచలం తన నాటకాలతో నాటి సాంఘిక దురాచారాలను ఖండిరచారన్నారు. కార్యక్రమంలో వైవీయూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి. శివారెడ్డి, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్ మౌనిక, పాఠకులు మనీల, సుదర్శన్ రెడ్డి, సురేష్, అనిల్ కుమార్, హరి, ప్రసాద్, రంతూ, గౌరీశంకర్, చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.










