Sep 02,2020 08:44

మధ్యేవాద నేత, గొప్ప అనుసంధానకర్తగా పేరొందిన మాజీ రాష్ట్రపతి 'భారతరత్న' ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూతతో మధ్యేవాద రాజకీయాల శకం ముగిసిందని చెప్పవచ్చు. భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రణబ్‌ ముఖర్జీ బహుముఖ ప్రజ్ఞాశాలి. తన జీవన ప్రయాణాన్ని వివరిస్తూ 'ఒక చిన్న దీపపు వెలుగు నుంచి ఢిల్లీలోని షాండ్లియర్‌ వెలుగు జిలుగులను చేరుకునే క్రమంలో నేను అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను' అన్నది అక్షర సత్యం. రాజకీయాల్లోకి రాకముందు అధ్యాపకుడిగా, పాత్రికేయుడిగా, రచయితగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్‌కు 1969లో రాజకీయాల్లో కీలక అడుగు పడింది. ఐదు పదుల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు అధిరోహించారు. కేంద్ర క్యాబినెట్‌లో 1973లో కేంద్ర క్యాబినెట్‌లో సహాయ మంత్రిగా చేరినప్పటి నుండి రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించడానికి ముందు (2012) వరకు వివిధ పదవులు నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు. 2012లో రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. 2019లో ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' పురస్కారాన్ని అందుకున్నారు. దేశ విదేశాల్లో పలు గౌరవ పురస్కారాలు పొందారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తలెత్తుతున్న ధోరణులు, పార్శ్వాలపై అనేక పుస్తకాలు రచించారు. ప్రణబ్‌ ముఖర్జీ ఒక సమర్ధుడైన మధ్యేవాద నేతగాను, అనుసంధానకర్తగానూ పేరొందడానికి ఆయన వ్యక్తిత్వమూ, వ్యక్తిగత సామర్ధ్యాలతోబాటు సమకాలీన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితుల ప్రాబల్యమూ కారణమే! ప్రణబ్‌ రాజకీయ ప్రవేశం చేసిన 70వ దశకం నుండి సుమారు 90వ దశకం వరకు వివిధ ప్రభుత్వాలు 'శ్రేయోరాజ్య' సిద్ధాంతాన్ని అమలు చేసిన కాలం. ప్రభుత్వ రంగ పరిశ్రమల విస్తరణ, ప్రజలకు సర్కారు రాయితీల వితరణ జరిగిన దశ అది. కాని, కాంగ్రెస్‌ సర్కారు 1991లో తెచ్చిన నయా ఉదారవాద ఆర్థిక విధానాలతో వాటికి బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధించిన ఆంక్షలతో భారత ప్రభుత్వమూ, అనేక రాష్ట్ర ప్రభుత్వాలూ ఆ బాట పట్టాయి. యుపిఎ-1 కాలంలో వున్న వెసులుబాటు యుపిఎ-2 నాటికి తగ్గిపోయింది. యుపిఎ-1కు కీలకంగా వుండిన వామపక్షాల మద్దతు అవసరం కూడా యుపిఎ-2 నాటికి లేకుండా పోయింది. ఉదారవాద ఆర్థిక విధానాల దూకుడూ పెరిగింది. అమెరికాతో మైత్రీ బంధమూ బిగుసుకుంది. ఈ తరుణంలో ప్రణబ్‌ వంటి సంధానకర్తల అవసరమూ తగ్గిపోయింది. అయితే, గౌరవప్రదంగా రాష్ట్రపతి పదవిని చేపట్టి ప్రణబ్‌ క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. ప్రజలు, ప్రజా ఉద్యమాలు ముందుకు తెచ్చే డిమాండ్లను ఏదో ఒక మేరకు నెరవేరుస్తూ, చర్చలతో సర్దుబాటు చేస్తూ ప్రజాస్వామిక పద్ధతి అన్న ముద్రను కొనసాగించేందుకు ఉన్న వెసులుబాటు క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. వెసులుబాటు తగ్గేకొద్దీ వివిధ వర్గాలను సముదాయించే పనీ పెరుగుతూ వచ్చింది. ఈ పని చేయడంలో ప్రణబ్‌ దా ది అందె వేసిన చెయ్యి. అయితే, ప్రణబ్‌ ముఖర్జీ అనుసరించిన మధ్యేవాద మార్గానికి ఇవి రోజులు కావు. మోడీ హయాంలో విజృంభిస్తున్న మతతత్వ శక్తుల దాడి, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం శృతి మించడంతో ప్రజల ఆదాయంపై, సంపదపై దాడిని ఉధృతం చేస్తున్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి విధానాలు మధ్యేవాద రాజకీయాలకు అవకాశం లేకుండా చేశాయి. అశేష ప్రజానీకం వైపుండాలా లేక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి లొంగిపోవడమా? ఈ రెండే మార్గాలు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వ్యక్తులకు గానీ రాజకీయ పార్టీలకు గానీ నేడున్నవి ఆ రెండు దారులే. ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజలతోపాటు నిలవడమే సరైన మార్గం.