Jul 05,2023 21:59

సమావేశంలో మాట్లాడుతున్న గుండుమల తిప్పేస్వామి

ప్రజాశక్తి మడకశిర రూరల్‌ : మడకశిర నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధిపై బహిరంగచర్చకు టిడిపి నాయకులు ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. బుధవారం పట్టణంలోని బాలాజీ నగర్‌ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం శాశ్వత సంక్షేమ కార్యక్రమాలు చేపడితే వైసిపి ప్రభుత్వంలో చిన్న చిన్న అభివద్ధి కార్యక్రమాలు కూడా చేయలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఉన్నారని విమర్శించారు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు గురించి విమర్శించేది స్థాయి లేదని అన్నారు. శిరా నుండి కోడికొండ చెక్‌పోస్టు వరకు జాతీయ రహదారిని తెచ్చిన ఘనత చంద్రబాబుదే నన్నారు. మడకశిర నియోజకవర్గంలో మూడు గురుకుల పాఠశాలలు, మూడు గురుకుల జూనియర్‌ కాలేజీలు తీసుకురావడంతో పాటు రైతులకు లో వోల్టేజ్‌ సమస్య పరిష్కారం కోసం రూ. 100 కోట్లతో హెచ్‌ వి డి ఎస్‌ పథకం ద్వారా వేల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసిన ఘనత టిడిపిది అని అన్నారు. రూ. 40 కోట్లతో పట్టణంలో రోడ్డు విస్తరణ చేసి 80 శాతం పూర్తి చేస్తే మిగిలిన 20 శాతం పనుల్లో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్‌ స్తంభాలను, ట్రాన్స్‌ఫార్మర్లను కూడా తొలగించే శక్తి ఎమ్మెల్యేకు లేదని ఎద్దేవా చేశారు. ధైర్యంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు అని అలా విమర్శిస్తే ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతారా అని నిలదీశారు. మరో మారు ప్రతిపక్ష నేతలపై కేసులు పెడితే పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, దాసిరెడ్డి మనోహర్‌, డాక్టర్‌ కృష్ణమూర్తి, తెలుగు యువత నాయకుడు తిమ్మరాజుతో పాటు నాయకులు జై కుమార్‌, పుల్లయ్య చౌదరి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.