Oct 18,2022 23:12

  • 1000 ఎకరాల్లో పెంపకానికిఅటవీశాఖ ప్రణాళికలు
  • రూ. 5 కోట్ల గ్రీన్‌క్లయిమెట్‌ ఫండ్‌కు ప్రతిపాదనలు

ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
సముద్రతీర ప్రాంతాల్లో తుపానులు, ఉప్పెనలు, సునామీలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ విపత్తుల నుంచి తీర ప్రాంతాలకు రక్షణ గోడలా నిలిచే మడ అడవులు అక్రమణలకు గురవుతున్నాయి. అక్రమార్కులు వేలాది ఎకరాలు ఆక్రమించి మడ అడవులను ధ్వంసం చేసి చెరువులను తవ్వి ఆక్వా సాగు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా జిల్లాలోని మడ అడవులను వృద్ధి చేసి తీర ప్రాంత సంరక్షణకు అటవీశాఖ ప్రణాళికలు రూపొందించింది. వెయ్యి ఎకరాల్లో మడ అడవుల వృద్ధికి రూ.5 కోట్ల గ్రీన్‌ క్లయిమెట్‌ ఫండ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
సముద్రతీర ప్రాంతం అత్యధిక విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లాగా కృష్ణాజిల్లా ఉంది. కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో 111 కిలోమీటర్ల మేర సముద్రతీరం విస్తరించి ఉంది. కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ ప్రాంతాల్లో మడ అడవుల్లో అరుదైన జంతువులు సంచరిస్తుండటంతో వైల్డ్‌లైఫ్‌ ఫారెస్టు డిపార్టుమెంట్‌ వారు ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారున. మచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో మరో 30 వేల ఎకరాల్లో మడ అడువులను ఫారెస్టు డిపార్టుమెంట్‌ (అటవీశాఖ) పర్యవేక్షిస్తోంది. జిల్లాల విభజనలో ప్రక్రియలో భాగంగా ఇటీవల అటవీశాఖను విభజించారు. విజయవాడకే పరిమితమై వేర్వేరుగా ఉన్న సోషల్‌, టెరిటోరియల్‌ ఫారెస్టు డిపార్టుమెంట్లను ఒకటిగా కలిపారు. సిబ్బందిని విభజించారు. తాజాగా మచిలీపట్నంలో కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మడ అడవుల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు వెయ్యి ఎకరాల్లో నూతనంగా మడ అడవుల వృద్ధికి అటవీ శాఖ సన్నాహాలు చేస్తోంది.
మూడు నర్సరీల్లో లక్ష మొక్కలు
జగనన్న పచ్చతోరణంలో భాగంగా జిల్లాలోని రహదారులు పక్కన, పాఠశాలల్లోని ఖాళీ ప్రాంతాలు ఈ ఏడాది లక్ష మొక్కలు నాటాలని అటవీశాఖ లక్ష్యంగా తీసుకుంది. గూడూరు, నందమూరు, పులిగడ్డల్లోని నర్సరీల్లోని మొక్కలను పంపిణీ చేస్తోంది. గన్నవరం, బాపులపాడు మండలాల్లో 2,500 ఎకరాల్లో అటవీభూములున్నాయి. ఈ అడటీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మ్యాపింగ్‌ చేస్తున్నారు. పూర్తయిన తర్వాత అటవీజాతి మొక్కలు నాటతారు.
మడ వృద్ధికి ప్రణాళికలు
కె.రాజశేఖరరావు, జిల్లా అటవీశాఖ అధికారి
జిల్లాలో 30 వేల ఎకరాల్లో మడ అడవులున్నాయి. కొంత భాగం ఆక్రమణలకు గురై చెరువులు తవ్వడం మా దృష్టికి వచ్చింది. వీటిపై చర్యలు తీసుకుంటాం. తాజాగా 1000 ఎకరాల్లో మడ వృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. గ్రీన్‌ క్లయిమెట్‌ ఫండ్‌కు ప్రతిపాదనలు చేశాం. త్వరలోనే ఈ ప్రాజెక్టు చేపడతాం. ఇప్పుడున్న అడవుల్లోని ఖాళీల్లో తిరిగి మడ మొక్కలు నాటతాం.