Feb 15,2022 07:07

   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరమీదికొచ్చింది. రాజకీయ చర్చల్లో కాగుతోంది. హాదాను ప్రజలు అంత తొందరగా మరచిపోరని, తప్పక తమ వెంటబడతారని బిజెపి కి మరోసారి అర్ధమైంది. మొన్ననే పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఎ.పి విభజన అవమానకరంగా జరిగిందని, నేటికీ రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేదని కాంగ్రెస్‌ను తూలనాడారు. నాటి అవమానకర విభజనకు బిజెపి వెన్నుదన్నుగా నిలిచిందన్న వాస్తవాన్ని ప్రధాని కావాలనే మరుగుపర్చారు. కేంద్రంలో తాము అధికారంలోకొచ్చి ఏడున్నరేళ్లయినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం కాకుండా పేరబెట్టి తమాషా చూస్తున్న సత్యాన్నీ మోడీ ఉద్దేశపూర్వకంగా దాచారు. తాజాగా ఈ నెల 17న ఎ.పి, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి హోం మంత్రిత్వశాఖ నిర్వహించే ఇరు రాష్ట్రాల అధికారుల భేటీకి తొలుత రూపొందించిన ఎజెండాలో ఎ.పి కి ప్రత్యేక హోదా అంశం ఉండగా, వెంటనే ఆ అంశాన్ని తొలగించారు. కేంద్ర బిజెపి చేస్తున్న విన్యాసాలు చూసిన వారికెవరికైనా హోదాకు సమాధి కట్టిందని ఇట్టే అర్థమైపోతుంది. బిజెపి ఫీట్లు ఇప్పుడే ప్రారంభం కాలేదు. 2014లో కేంద్రంలో గద్దెనెక్కిన నాటి నుండి ఇదే వరస. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసని, ప్రత్యేక ప్యాకేజీ అని, హోదాతో సమానంగా నిధులని లెక్కలేనన్ని డ్రామాలు ఆడి ఎ.పి ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది. ఇప్పుడేమో ఎ.పికి ఇచ్చిన హోదా హామీ నెరవేర్చకుండా మరోసారి చర్చించాలని తప్పుడు వాదనలు చేస్తోంది.
    పదిహేనేళ్ల హోదా హామీతో 2014 ఎన్నికల్లో బిజెపి తో కలిసి పోటీ చేసి రాష్ట్రంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ నాలుగేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకొని ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కాలక్షేపం చేసింది. హోదా సాధన సమితి, వామపక్షాలు ఆందోళనలు ఉధృతం చేసిన దరిమిలా బిజెపి ద్రోహం చేసిందంటూ ఆ పార్టీ నుండి విడగొట్టుకుంది. అప్పుడు కూడా అధికార టిడిపికానీ, ప్రధాన ప్రతిపక్షం వైసిపి కానీ హోదాపై ఐక్య ఆందోళనలకు అంటి ముట్టకుండా ఉన్నాయి. హోదా ఇవ్వని బిజెపి ని పల్లెత్తు మాట్లాడకుండా ఆ రెండు పార్టీలూ ఒకరిపై ఒకరు బురదజల్లుకున్నాయి. అయినప్పటికీ ప్రజలు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు హోదా అత్యవసరమని, పారిశ్రామికంగా ఎదగాలంటే హోదా ఊతం అవసరమని గ్రహించారు. హోదాను విభజిత రాష్ట్ర హక్కుగా పరిగణించారు. 2019 ఎన్నికల్లో ఆ విధంగానే దిశానిర్దేశం కావించారు.
    మాకు అధికారం ఇస్తే హోదా కోసం ప్రాణాలొడ్డి పోరాడతా, కేంద్రం మెడలు వంచైనా హోదా సాధిస్తామన్న వైసిపి కుర్చీ ఎక్కగానే ప్లేటు ఫిరాయించింది. కేంద్రంలో బిజెపి కి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది కనుక ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. అసలు మెజార్టీకి, హోదాకు ఏంటి సంబంధం? బిజెపి కి మెజార్టీ రాకపోతేనే హోదా అడుగుతారా, మెజార్టీ వస్తే హోదాను వదిలేస్తారా? రాష్ట్రాల హక్కుల కోసం ఇతర రాష్ట్రాలు కేంద్రంపై పోరాడుతున్నాయి. హోదా కోసం వైసిపి ప్రభుత్వం ఎందుకు కేంద్రాన్ని నిలదీయదు? రాష్ట్ర ప్రయోజనాలకు, హక్కులకు కేంద్ర బిజెపి ఎసరు పెట్టినప్పుడైనా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరు? బిజెపి అంటే భయమా, భక్తా, సర్దుకుపోవడమా, క్విడ్‌ప్రోకో వంటి లోపాయికారీ ప్రయోజనాలా? ముఖ్యమంత్రి మౌనానికి కారణమేంటో ప్రజలకు తెలియాలి. సి.ఎం కాకుండా ఎవరో నాయకులు మాట్లాడితే ఏమిటి ఉపయోగం? నవంబర్‌ నెల రాష్ట్ర పారిశ్రామిక సూచీ మైనస్‌ 9.3కి దిగజారింది. హోదా ఉంటే ఈ దుర్గతి దాపురించేది కాదు. ప్రైవేటీకరణ, అదానీ, అంబానీలకు వనరుల ధారాదత్తం, సంస్కరణల అమలులో బిజెపి రాష్ట్రాల కంటే సైతం ఎ.పి ముందున్నది. అంతగా కేంద్రానికి జీహుజూర్‌ అనడం ఎందుకు? రాష్ట్రానికి జీవనాడి అయిన హోదాను ఎందుకు అడగట్లేదు? రాష్ట్ర విశాల ప్రయోజనాలు, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఉపకరించే హోదాపై వైసిపి ప్రభుత్వం మౌనం వీడి అందరినీ కలుపుకొని కేంద్రంపై పోరాడాలి. బిజెపి వంచనపై నిలదీయాలి. కేంద్రాన్ని బోనులో నిలబెట్టాలి. లేకపోతే హోదా ఇవ్వని బిజెపి నేరస్తురాలైతే, అడగని వైసిపి సైతం ముద్దాయే అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చకపోతే ఉధృత ప్రజా పోరాటాలను చవిచూడక తప్పదు.