కన్నూర్ : ప్రాథమిక ఆరోగ్యం, సామాజిక సంక్షేమంపై కేరళ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ''అభివృద్ధి పథంలో కేరళ ముందంజలో ఉంది. ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సిల్వర్‌లైన్ ప్రాజెక్టు ద్వారా సామాజిక న్యాయానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది.'' అని అన్నారు. సీపీఎం 23వ మహాసభకు స్వాగతం పలుకుతూ విజయన్ ప్రసంగించారు. ఆ సందర్భంగా ఈ విషయాలు పేర్కొన్నారు. ''దక్షిణ కేరళ నుంచి ఉత్తర కేరళకు వెళ్లేందుకు 4 గంటల సమయం పట్టే సెమీ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం పొందేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని సేకరించినప్పుడు ప్రభుత్వం ప్రజలకు తగిన పరిహారం అందజేస్తుంది. ఇంటింటికి తిరిగి అవసరమైన అవగాహన కలిగిసోంది.'' అని సీఎం స్పష్టం చేశారు.
''ఎన్నో చారిత్రిక పోరాటాల గడ్డ కన్నూరు. పార్టీ మహాసభలు ఇక్కడ జరగటం ఆ గొప్ప వారసత్వం కొనసాగింపునకు చిహ్నం.'' అని విజయన్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి ఇప్పటివరకు మలయాళ గడ్డ మీద జరిగిన వీరోచిత, స్ఫూర్తిదాయక పోరాటాలను ఆయన గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు.
పోరాటాల గడ్డపై చారిత్రిక మహాసభలు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వాగతోపన్యాసం
''కేరళలో కమ్యూనిస్టు పార్టీ జన్మస్థలం ఇది. మహాసభలకు ఈ ప్రాంతం వేదిక కావడం కేరళీయులకు గర్వకారణం. పార్టీ అఖిల భాతర మహాసభలు కన్నూరుకు జరగటం ఇదే మొదటిసారి. పి కృష్ణపిళ్లై, ఇఎంఎస్, కె దామోదరన్, ఎన్‌సి శేఖర్ తదితరులు కోజికోడ్‌లో ఓ నిర్బంధ ఇరుకు గదిలో పార్టీ ఆవర్భానికి బీజాలు వేశారు. అక్కడి నుంచి విశాల ప్రజాబాహూళ్యాన్ని, వారి హృదయాలను చూరగొనేదాకా పార్టీ ఎదిగింది. ఆ ఎదుగుదల చరిత్రలో కన్నూర్ ఒక మూలస్తంభం. ఈ మహాసభ ఆ కొనసాగింపు చరిత్రలో ఒక మైలురాయి.
వీరోచిత పోరాటాల విప్లవ కావ్యాన్ని రచించిన వీర అమరవీరుల గడ్డ కన్నూర్. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి మరణించిన వీర పజాస్సీ వారసత్వ భూమి ఇది. జాతీయోద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం జరిగిన పయ్యన్నూరు నేల ఇది. ఫ్యూడలిజానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతం ఇది. కయ్యూరు, కరివెల్లూర్, కోరం, మొరజా, మునయన్ కున్ను, కావుంబై, పడికున్ను, థిల్లంకేరి పోరాట చరిత్రల సమాహారం కేరళ.
ఇక్కడి ప్రజల దుర్భర జీవన స్థితిగతులను మార్చేందుకు కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు చేసింది. భూస్వాముల ఆక్రమిత భూములను ప్రజల పరం చేయటానికి ప్రాణాలకు తెగించి ఎందరో వీరులు పోరాడారు. లౌకికవాద విలువలను కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించిన యు కున్హిరామన్ వంటి యోధులు ఇక్కడ పుట్టారు. ఇకె నాయనార్, కున్హంబు, కనరన్, అజికోడన్ రాఘవన్, పాట్యం గోపాలన్ వంటి యోధులు ఈ నేల నుంచే వచ్చారు. జీవితాంతం ప్రజాపక్షం వహించి పోరాడారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన శ్రీ నారాయణ గురు జగన్నాథ దేవాలయం ఇక్కడే ఉంది. చెరుస్సేరి, కేసరి నాయనార్, ఓ చంతుమేనన్ వంటి వారి సృజనాత్మక ప్రావీణ్యం పరిఢవిల్లిన ప్రాభవం ఇక్కడిదే! కయ్యూరు అమరవీరుల అరుణారుణ త్యాగాల నేల ఇది. ఇక్కడ మహాసభలు జరగటం మాకు గర్వకారణం. ఒక ఉజ్వల చరిత్ర వారసత్వానికి కొనసాగింపు.''
''ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలకు ప్రత్యామ్నాయం లేదని కాంగ్రెస్, బీజేపీలు వాదిస్తున్న వేళ, వామపక్షాలు సరైన ప్రజాపక్ష ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. అందుకే వామపక్షాలు, సీపీఎం వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మతతత్వం నిరంకుశత్వంతో పాటు లౌకికవాద విలువలను హరిస్తోంది. ఈ దశలో ప్రజలు సిపిఎంని లౌకికవాదానికి సంరక్షక శక్తిగా ప్రజలు చూస్తున్నారు. నేడు మనదేశ ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రానికి ప్రమాదం కలిగించే విధానాలను బిజెపి అనుసరిస్తోంది. దానికి వ్యతిరేకంగా సిపిఎం మాత్రమే అత్యంత గట్టిగా తన వామపక్ష గొంతును వినిపిస్తోంది. ఇలాంటి ప్రజాపక్షాన్ని ఎలాగైనా నాశనం చేయాలని మతోన్మాద శక్తులు, తీవ్రవాదులు, సామ్రాజ్యవాద శక్తులు ఏకతాటిపైకి వస్తున్నాయి. వీరందరూ సీపీఎంను తమ శత్రువుగా చూడడమే నేడు గుర్తించాల్సిన రాజకీయ ప్రాధాన్యత.''
''ఆధునిక కేరళ నిర్మాణం కోసం ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. స్వల్పకాలంలో ప్రజల కష్టాలను తీర్చి, దీర్ఘకాలంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ప్రయత్నం చేస్తోంది. ఇది కొన్ని అభివృద్ధి నిరోధక శక్తులకు కంటగింపుగా మారింది.''
''నేడు ప్రపంచవ్యాప్తంగా 'మార్క్స్ మార్గము సరైనదే' అన్న నినాదం వెల్లువెత్తుతోంది. ఒక్క శాతం ఉన్న అతి ధనవంతుల రాజకీయ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాల్లో 90 శాతం మంది ప్రజలు బలం పుంజుకుంటున్నారు. మరోపక్క పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు సిపిఎం రాజకీయ విధాన ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతున్నాయి. స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిస్టు భావనల పరిరక్షణకు, వాటిని ప్రబలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గట్టి కృషి చేయాల్సి ఉంది. అందుకే దేశం మొత్తం ఈ మహాసభల వైపు ఆశగా చూస్తోంది.''










