- బొబ్బిలిలో 110 మంది కార్మికుల అరెస్టు
- తోపులాటలో స్పహ కోల్పోయిన ఇద్దరు మహిళలు
ప్రజాశక్తి- బొబ్బిలి (విజయనగరం జిల్లా) : తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లోని మైతాన్ పరిశ్రమ పనులను కార్మికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. కార్మికులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంపెక్స్ పరిశ్రమను మైతాన్ యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ పాత కార్మికులను పనిలోకి తీసుకోకుండా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పించి పనులు చేయించడంతో పాత కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో, పోలీసులు, డిసిఎల్ సమక్షంలో జరిగిన చర్చల్లో పాత కార్మికులను పనిలోకి తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరించలేదు. దీంతో,, కార్మికులు ఆ పరిశ్రమ పనులను అడ్డుకుని ఇతర రాష్ట్రాల కార్మికులను బయటకు పంపేశారు. పనులను అడ్డుకుంటే కేసులు పెడతామని పోలీసులు బెదిరించినా కార్మికులు ఆందోళన విరమించలేదు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో 110 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి బాడంగి, తెర్లాం, బొబ్బిలి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుల సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు తోసేయడంతో ఇద్దరు మహిళా కార్మికులు స్పృహ తప్పి కింద పడిపోయారు. న్యాయం చేయాలని కోరితే పోలీసులు యాజమాన్యానికి కొమ్ముకాసి తమను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను చూసేందుకు ఆయా పోలీసు స్టేషన్‌కు వెళ్లిన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.











