ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని మదనపల్లె డిఎస్‌పి కేశప్ప హెచ్చరించారు. బుధవారం స్థానిక ఒన్ టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 17 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, ఎక్కడైనా వారికి రోడ్డు ప్రమాదం జరిగితే ప్రమాదానికి కారణమైన యువకులతో పాటు వాహనం యజమాని పైన కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలను ఇవ్వొద్దన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేనిదే వాహనాల నడపరాదని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఎవరైనా పండుగలకు ఊళ్లకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సంక్రాంతి నేపథ్యంలో ఊర్లకు వెళ్లే వాళ్లు తప్పనిసరిగా ఇళ్లకు తాళాలు వేసి పోలీసులకు సమాచారం చేరవేస్తే చోరీలు జరగకుండా రాత్రివేళ గస్తీ నిర్వహిస్తారని చెప్పారు. లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంతో నిఘా ఉంటుందన్నారు. పోలీసులకు సహకరిస్తే నేరాలు నియంత్రణ కు క షి చేస్తామని తెలిపారు. ఊర్లకు వెళ్లే ముందు రోజు వారి పరిధిలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఒన్ టౌన్ ఇన్‌ఛార్జి సిఐ సాదిక్ అలీ, రూరల్ సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు.










