Jul 11,2021 11:46

తిరుపతి : తిరుపతిలో మైనర్‌ బాలిక కిడ్నాప్‌ సంచలనాన్ని రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్‌ చేసినవారెవరో తెలిసి అవాక్కయ్యారు. ఇంతకీ బాలికను కిడ్నాప్‌ చేసిందెవరంటే... సొంత అమ్మమ్మ ! వివరాల్లోకెళితే... చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఈ ఘటన వెలుగుచూసింది. 29 ఏళ్ల తన మనవడు మురళీకృష్ణను పెళ్లి చేసుకోవాలని 14 ఏళ్ల మైనర్‌ బాలికను తన అమ్మమ్మ కొద్దిరోజులుగా బలవంతం చేస్తోంది. అయితే దీనికి కూతురు లక్ష్మీ అడ్డుచెబుతూ వస్తోంది. తన కూతురిది చిన్న వయసేనని, అతని వయసుకు తన కూతురి వయసుకు చాలా తేడా ఉందని, ప్రస్తుతం తన కూతురిని చదివించాలనుకుంటున్నానని లక్ష్మీ కచ్చితంగా చెప్పేసింది. గత సంవత్సర కాలంగా తన మనవడు మురళీకృష్ణకు లక్ష్మీ కూతురునిచ్చి వివాహం చేయాలంటూ అమ్మమ్మ ఒత్తిడి తెస్తోంది. అయినా తన కూతురు ఒప్పుకోకపోవడంతో... ఎలాగైనా తన మనవడికి మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచనతో అమ్మమ్మ ప్లాన్‌ వేసింది. మూడు రోజులక్రితం తిరుచానూరుకు వచ్చి కూతురి ఇంట్లో మకాం వేసింది. లక్ష్మీ స్థానికంగా చిన్న చిన్న పనులను చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తోంది. అలా వచ్చిన డబ్బుతో కూతురిని చదివిస్తోంది. లక్ష్మీ పని కోసం బయటకు వెళ్లిన సమయంలో కారు తీసుకొచ్చి తన కొడుకు ఆదినారాయణతో కలిసి సొంత మనవరాలిని అమ్మమ్మ కిడ్నాప్‌ చేయించింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్‌ కేసును నమోదు చేసుకొని బాలిక కోసం గాలించారు. బాలిక నుండి పూర్తి వివరాలను తెలుసుకున్న తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.