Feb 17,2023 20:05

అయ్యూబ్‌ హుసేన్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే చింతల

ప్రజాశక్తి-వాల్మీకిపురం : రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ సెక్రటరీ అయ్యూబ్‌ హుసేన్‌ అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం వాల్మీకిపురంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల మాట్లాడుతూ పీలేరు అసెంబ్లీ నియోజకవర్గం సహా ముస్లిం మైనారిటీలు, ఉర్దూ విద్యార్థులు, ఉపాధ్యాయులు అత్యధికంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో ఉర్దూ అకాడమీ సేవలను విస్తతం చేయాలన్నారు. సమాజంలో ముస్లిం మైనారిటీలు ఇప్పటికీ సామాజికంగా వెనుకబడి ఉన్నారని, పేదరికంతో అలమటిస్తున్నారని, మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ దారిద్య్రరేఖ దిగువనే ఉండడం విచారకరమన్నారు. మైనార్టీలు విద్యాపరంగా అభివద్ధిని సాధించినప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పీలేరులో ఉర్దూ అకాడమీ గ్రంథాలయాన్ని, కంప్యూటర్‌ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భవన వసతిని కల్పిస్తామన్నారు. పీలేరు నియోజకవర్గంలో 35వేల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారని, వీరందరూ ఉర్దూను చదివే వారేనని తెలిపారు. కలికిరి, గుర్రంకొండ మండలాల్లో హిందువులు కూడా ఉర్దూ చదవడం రాయడం గమనార్హమన్నారు. అనంతరం ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ సెక్రటరీ అయ్యూబ్‌ హుసేన్‌ మాట్లాడుతూ పీలేరులో ఉర్దూ అకాడమీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందుకు రాష్ట్ర చైర్మన్‌ నదీమ్‌ అహ్మద్‌ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం అయ్యూబ్‌ హుసేన్‌ను ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దుశ్శాలవతో సన్మానించారు. కార్యక్రమంలో వైసిపి మైనార్టీ నాయకుడు అబ్దుల్‌ కలీమ్‌, కలికిరి మండల కోఆప్షన్‌ సభ్యులు రిజ్వానుల్లా, వైసిపి నాయకులు చికెన్‌ మస్తాన్‌, సైఫుల్లా, గంగయ్య, సద్దాం, ఉర్దూ అకాడమీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.