ప్రజాశక్తి - వాల్మీకిపురం: బాలికలు ఎదుటివారు చెప్పే మాయమాటలకు మోసపోకూడదని, ప్రమాద సమయంలో వ్యక్తిగత రక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలని డిపిఒ ధనలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో బాలికను చదివిద్దాం, బాలికను రక్షిద్దాం అనే నినాదంతో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలు చేసుకోవడం వలన అనేక నష్టాలు కలుగుతాయన్నారు. నేటి పోటీ ప్రపంచంలో బాలికలకు చదువు ఎంతో అవసరమని, సమాజంలో ఏ విషయాలను తెలుసుకోవాలన్న చదువు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆకతాయిలు ఎవరైనా వేధించినా, ఏదైనా ఆపద వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ 1098, 100, 181 లకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో సిడిపిఒ భారతి, హెచ్‌ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










