పూర్తిపేరు : ఎవెలిన్ లక్ష్మీ శర్మ
పుట్టినతేది :12 /జులై 1986
జన్మస్థలం : పశ్చిమ జర్మనీ
వృత్తి :మోడల్, నటి
నటించిన ఇండిస్టీలు :హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్
తెలుగు పరిచయం : సాహో
జీవిత భాగస్వామి : డాక్టర్ తుషాన్ భిండి
పిల్లలు : ఒకరు(అమ్మాయి)
ఎవెలిన్ శర్మ అనే పేరు చెప్పగానే ఎక్కడో విన్నట్టుగా ఉందే అని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. తెలుగులో ఆమె చేసింది ఒకటే సినిమా. కాస్త ఆలోచన చేస్తే 'సాహో' సినిమాలో జెన్నిఫర్ అనే ముఖ్య పాత్రను పోషించిన విషయం గుర్తుకు వస్తుంది. ఈమధ్య కాలంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారామె. తాజాగా బిడ్డకు పాలిస్తున్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దానిపై తప్పుగా కామెంట్ చేసిన కొందరి నెటిజన్లపై 'మాతృత్వపు మాధుర్యాన్ని చూడండి. అశ్లీలాన్ని కాదు' అంటూ తనదైన శైలిలో హితబోధ చేశారు..
ఆస్ట్రేలియాకు చెందిన ప్రవాస భారతీయుడు.. దంత వైద్యుడు 'తుషాన్ భిండి'తో కొంతకాలం క్రితం ఎవెలిన్ శర్మ వివాహమైంది. ఈమధ్య కాలంలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో 'ఇకపై అమ్మ పాత్రను పోషించవలసి ఉంది. అన్ని పాత్రల కంటే అమ్మ పాత్రను పోషించడం చాలా కష్టం. ఆ పాత్రకి న్యాయం చేయడానికి ప్రతిక్షణం సిద్ధంగా ఉంటా. ఒక తల్లిగా నేను పొందుతున్న అనుభూతిని మాటల్లో చెప్పలేను' అంటూ తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు ఎవెలిన్. తాజాగా ఆమె కూతురికి పాలిస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. అందులో 'ప్రతిరోజూ... రోజంతా ఇలాగే' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇంకా ఆ పోస్ట్‌లో 'నేను తల్లిపాలు ఇస్తున్న ఫోటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను? అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అదే నా ప్రస్తుత ఉద్యోగం. దీనికోసం ఎన్నో అదనపు గంటలు పని చేశా, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడమే.. ఈ కష్టానికి అందే జీతం. అదే తల్లిగా ఎవరైనా కోరుకునేది' అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
పిల్లలకు పాలివ్వడం గురించి ఎవెలిన్ మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి పిక్‌నే పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక నెటిజన్ 'ప్రపంచంలోనే అత్యంత అందమైనది ఇదే. పాప చాలా ముద్దుగా ఉంది. రాబోయే కొత్త తరానికి మీరే రోల్ మోడల్. ఇలాగే ఉండండి' అంటూ కామెంట్ చేశారు. అలాగే మరికొందరు పాజిటివ్ కామెంట్స్‌తో ఎవెలిన్‌ను మెచ్చుకున్నారు. కానీ కొందరు నెగెటివ్ కామెంట్స్ సైతం చేస్తున్నారు. 'పాలు ఇవ్వాలనుకుంటే ప్రైవేట్‌గా ఇవ్వు. ఇలా పాలు ఇస్తూ ఫోటోను షేర్ చేయడం ఏంటి?' అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పదించారు. 'తల్లిగా నా ప్రయాణం గురించి అభిమానులకు, స్నేహితులకు షేర్ చేయాలి అనుకున్నా. బ్రెస్ట్‌ఫీడింగ్ అనేది తప్పు కాదు కదా! అది సహజం. అమ్మతనం. దాంట్లో సిగ్గు పడటానికి ఏముంది? ఇటువంటి ఫోటోలు బలాన్నిస్తాయి. ఒక్కోసారి అవే దుర్బలంగా అనిపించవచ్చు. బ్రెస్ట్‌ఫీడింగ్ అంటే అందరూ అనుకున్నంత ఈజీగా కాదు. తల్లిగా జర్నీ స్టార్ట్ అయ్యాక.. ఫిజికల్‌గా, మెంటల్‌గా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవన్నీ అందరు తల్లులకు తెలియాలనే ఆ ఫోటోను షేర్ చేశా' అంటున్నారు. అందులో ''మాతృత్వపు మాధుర్యాన్ని చూడండి.. అంతేకానీ అశ్లీలాన్ని కాదు'' అంటూ చెప్పుకొచ్చారు ఎవెలిన్.
మూగజీవాల్ని కాపాడదాం..
సామాజిక అంశాలపై ఇటీవల సెలబ్రిటీలు బాగా స్పందిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియాలో కార్చిచ్చుకు కోట్ల సంఖ్యలో కంగారులు, కోయిలలు, ఇతర ప్రాణులు చనిపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఉడుము పిల్లను తన చేతుల్లోకి తీసుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్‌చేస్తూ ''మూగ జీవాన్ని ఇలా పట్టుకుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. మూగ జీవాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది'' అంటూ క్యాప్షన్ పెట్టారు.
నెపోటిజం ఇక్కడ రాజ్యమేలుతోంది
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత సినీ ఇండిస్టీలో నెపోటిజంపై ఎక్కువమంది మాట్లాడారు. ఆ సమయంలో ఎవెలిన్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నో సినిమా అవకాశాలను నెపోటిజం కారణంగా మిస్సయ్యాను. కొన్ని సినిమాలలో నన్ను హీరోయిన్‌గా బుక్ చేసుకుని, అగ్రిమెంట్ కూడా అయ్యాక రాత్రికి రాత్రే తొలగించారు. అలా చేజారిన అవకాశాల వల్ల ఎప్పుడూ నిరాశ చెందలేదు. ఆ ఘటనలే నాలో మరింత ధైర్యాన్ని, మొండితనాన్ని పెంచాయి. ఎవరు ఏమనుకున్నా బాలీవుడ్‌లో అధికారం, డబ్బు ఉన్న వాళ్లదే రాజ్యం' అంటున్నారు ఎవెలిన్. ఎప్పుడూ కాంట్రవర్సీలకు కాస్త దూరంగా ఉండే ఆమె నెపోటిజంపై నోరు విప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
జర్మనీకి చెందిన ఎవెలిన్ హాలీవుడ్ సినిమాలతో తన కెరియర్‌ను మొదలుపెట్టారు. అక్కడ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ అవకాశాల పట్ల ఆసక్తిని చూపుతూ వచ్చారు. ''ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్'' అనే సినిమాతో 2012లో బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. రణబీర్ - దీపిక జంటగా చేసిన ''యే జవాని హై దివాని'' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ''ఇషాక్'', ''యారయాన్'',. ''మై తేరా హీరో''లాంటి సినిమాలు ఆమెను బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. కొంతకాలంగా సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా నెటిజన్లతో టచ్‌లో ఉంటున్నారు ఎవెలిన్ .