May 24,2023 21:59

ఫొటో : మాట్లాడుతున్న ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి

మాతృభాషా పరిజ్ఞానం అలవరచుకోవాలి
ప్రజాశక్తి-మర్రిపాడు : విద్యార్థులు మాతృభాషపై మమకారం పెంచుకొని భాషా పరిజ్ఞానం పొందాలని ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి సూచించారు. స్థానిక గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను ఆయన బుధవారం సందర్శించి విద్యార్థులతో పలు విషయాలను ముచ్చటించారు. అమ్మభాష తేనె కన్నా మధురమైనదని శ్రీ కృష్ణదేవరాయలతో దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పబడి తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. నేడు విద్యార్థులు పరాయి భాషా వ్యామోహంలో పడి మాతృభాషను మతృభాషగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం గ్రంథాలయంలో ఉన్న రామాయణం, భారతం, భాగవతం గ్రంథాలను పరిశీలించారు. విద్యార్థుల పఠనా శక్తిని పరీక్షించు నిమిత్తం విద్యార్థులతో ఆంగ్ల తెలుగు కథనాలను చదివించారు. తెలుగులో పద్యం చెప్పిన మరో విద్యార్థినికి భావాన్ని చెప్పారు. గతవారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్‌ఛార్జి గ్రంథాలయాధికారి నారాయణరావు ఎస్‌ఐను ఘనంగా సన్మానించారు.