Jan 09,2023 21:25

సచివాలయ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న కెవిపిఎస్‌ నాయకులు, దళితులు

            ప్రజాశక్తి-పెనుకొండ   ప్రభుత్వాలు మారుతున్నా దళితుల తలరాతలు మారడం లేదని కెవిపిఎస్‌ జిల్లా నాయకులు రమేష్‌ అన్నారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లి-4వ సచివాలయంలో వీఆర్వో ఓబులేసు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ రాజేష్‌కి కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా నేటికీ దళితులపై వివక్ష, అంటరానితనం కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా దళితులకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలని, శ్మశాన వాటిక స్థలంలో ప్రహరీలు నిర్మించాలని, నీటి తొట్టి, విద్యుత్‌ తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రం నాయకులు ఓట్ల కోసం వచ్చి మభ్యపెట్టి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన తర్వాత విస్మరిస్తున్నారన్నారు. జీవో 12, 35 ప్రకారం దళితుల శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా నాయకులు రమేష్‌, మండల నాయకులు తిప్పన్న, బాబు రామంజి, అంజి, ముత్యాలు, అశ్వత, వెంకటేష్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.