Nov 22,2022 22:05

మార్కెట్‌లో బహిరంగ వేలం నిర్వహిస్తున్న దృశ్యం

నోటీసులు లిచ్చి చేతులు దులుపుకున్న అధికారులు
ప్రజాశక్తి-హిందూపురం :హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కమిషన్‌ ఏజెంట్లు, వ్యాపారులు తిరిగి పాతపద్దతినే అనుసరిస్తున్నారు. వారు రైతులకు, మార్కెట్‌కు, ప్రభుత్వానికి చేస్తున్న మోసం, అమలుకు నోచని ఈ-నామ్‌ విధానంపై ప్రజాశక్తి దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మార్కెట్‌ కార్యదర్శి వెంకటేశులు ఇకపై వంద శాతం ఈ-నామ్‌ అమలు చేస్తామని చెప్పారు. దీంతో పాటు ఈ-నామ్‌ అమలు చేయని వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్‌లకు నోటీసులు ఇచ్చి, ఇక నుంచి తప్పని సరిగా ఈ-నామ్‌ విధానంలోనే మార్కెట్‌కు వచ్చిన సరుకును కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నోటీసులు ఇచ్చింది ఒక్క రోజు కోసమే అన్న విధంగా ఏజెంట్లు, వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. మంగళవారం జరిగిన మార్కెట్‌లో వ్యాపారులు, కమిషన్‌ ఏజెంట్లు అదే పద్దతి పాటిస్తు, ఈ-నామ్‌ను బద్నామ్‌ చేశారు. ఈ విషయాలన్ని ఇక్కడ పని చేసే సుపర్‌వైజర్లకు తెలిసినప్పటికి చూసి చూడనట్లు వ్యవహరించారు. నిబందనల మేరకు తప్పు చేసిన వ్యాపారులపై, కమిషన్‌ ఏజెంట్లపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ ఆదిశగా చర్యలు కన్పించలేదు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న యార్డు కార్యదర్శి ఇన్‌ఛార్జి కావటంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపడుతున్నాయి.