అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్
హోరా హోరీగా సాగిన కలెక్టర్, ఎస్పీ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్
25 పరుగుల తేడాతో ఎస్‌పి జట్టు విజయం
ప్రజాశక్తి - కడప/రాయచోటి: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ పేర్కొన్నారు. ఆదివారం కడపలోని వైయస్ రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో అన్నమయ్య జిల్లా, కలెక్టర్ -11, ఎస్‌పి -11 జట్ల మధ్య టి20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. క్రీడాకారులను అన్నమయ్య కలెక్టర్ గిరీష, ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ రెడ్డి, కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్, ఎస్‌సిఎసబ్ జోన్ అకాడమీ కన్వీనర్ సంజరు కుమార్ రెడ్డి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలన్నారు. ఈ క్రికెట్ పోటీలలో ఓడినవారు నిరుత్సాహం చెందకుండా రాబోయే మ్యాచ్ లో గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి కడప మాస్టర్స్ క్రికెట్ క్లబ్ తరఫున క్రికెట్ కిట్, 50 మందికి క్రికెట్ యూనిఫామ్ అందజేయడం ఎంతో శుభపరిణామన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయాల సిబ్బంది మంచి స్పోర్టివ్‌గా క్రికెట్ మ్యాచ్ ఆడారని చెప్పారు. విధి నిర్వహణలో ఉన్నప్పటికీ క్రికెట్ మ్యాచ్ ఇంతటితో ఆపకుండా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ క్రికెట్ ఆడుతూ ఉండాలన్నారు. దీంతో శరీర దఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. అనంతరం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు.
25 పరుగుల తేడాతో ఎస్‌పి జట్టు విజయం
కలెక్టర్, ఎస్‌పి జట్ల మధ్య ఆదివారం కడపలోని వైయస్ రాజారెడ్డి ఏసిఎస్ స్టేడియంలో నిర్వహించిన టి20 మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఎస్పీ -11 జట్టు గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌పి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కలెక్టర్ జట్టు 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆల్ అవుట్ అయ్యి ఓటమి చెందింది. ఎస్‌పి టీమ్‌కు చెందిన శ్రీనివాస్ 66 పరుగులు, 2,వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. కలెక్టర్ టీంకు చెందిన పెంచలయ్య 5 ఫోర్లు, ఒక 6 మొత్తం 38 పరుగులతో బెస్ట్ బ్యాట్స్మెన్ గా నిలిచారు. బెస్ట్ బౌలర్ గా హేమంత్ రెడ్డి నిలిచారు. విన్నర్స్, రన్నర్స్ క్రికెట్ విజేతలకు జిల్లా కలెక్టర్, ఎస్‌పి చేతుల మీదుగా కడప మాస్టర్స్ క్రికెట్ క్లబ్ తరపున మెడల్స్, మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.










