ఒక్కోసారి తెలిసో, తెలియకో మనిషి వల్ల నేరం జరుగుతుంది. చట్టం శిక్ష విధిస్తుంది. కానీ అన్నిసార్లు శిక్షలు పడకపోవచ్చు. అంతమాత్రాన నేరం చేయలేదని అర్థం కాదు. చట్టం నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది ఆ మనిషిని ఊరికే ఉండనిస్తుందా? మానసికంగా అది అల్లకల్లోలం చేస్తుందా? లేదా? పశ్చాత్తాపంతో నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తుందా? శిక్షను తప్పించుకుందామనుకుని ప్రయత్నిస్తూ ఆ మనిషి అశాంతిలో తనకు తాను వేసుకునే శిక్ష ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే 'జల్సా' మూవీని చూడాల్సిందే...
కథేంటంటే ముంబై నగరంలో ఉన్నత వర్గానికి చెందిన జర్నలిస్ట్ మాయా మీనన్ (విద్యాబాలన్). ఒంటరి మహిళైన ఆమెకు సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో బాధపడే పన్నెండేళ్ల కొడుకు ఉంటాడు. వాడికి తోడుగా అమ్మమ్మ (రోహిణి హట్టంగడి) ఉంటుంది. వీరందరికీ వండి పెట్టడానికి రుక్సానా (షెఫాలీ షా) అనే వంట మనిషి. మీనన్ విలువలున్న జర్నలిస్ట్. ఆమె సత్యాన్ని వెలికి తీయడానికి ఎంతటి వారినైనా ఎదిరిస్తూ ఉంటుంది. ఒకరోజు అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని, ఇంటికి వెళ్లే క్రమంలో కారు డ్రైవ్ చేస్తూ ఒక టీనేజ్ అమ్మాయిని ఢ కొడుతుంది. ఊహించని ఆ సంఘటనకు బెంబేలెత్తి పోతుంది. చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. కారు దిగి చూసే ధైర్యం చేయదు. చావు బతుకుల్లో ఉన్న ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి, ఇల్లు చేరుకుంటుంది.
కానీ మరుసటి రోజు మాయా మీనన్‌కు ఒక నిజం తెలు స్తుంది. తాను యాక్సిడెంట్ చేసిన అమ్మాయి రుక్సానా కూతు రేనని. కానీ ఆ విషయం బయటపడితే తన పరువు పోతుం దని, జైలు జీవితం గడపాల్సి వస్తుందని ఆందోళన చెందుతూ ఉంటుంది. మరోవైపు సొంత బిడ్డలాంటి అమ్మాయి జీవితం తన వల్లే నాశనం అయ్యిందనే బాధ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. పశ్చాత్తాపంతో పనిమనిషి కూతురికి వైద్యం చేయిస్తూ ఉంటుంది. ఇదంతా తెలియని రుక్సానా తన యజమాని మంచితనంతో తన కూతురికి వైద్యం చేయిస్తోంది అనుకుంటుంది. కానీ చివరకు తన యజమాని వల్లే కూతురి పరిస్థితి ఇలా అయ్యిందనే విషయం రుక్సానాకు తెలిసిపోతుంది. అప్పుడు ఆమె ఏమి చేసిం ది? సత్యాన్ని వెలికితీసే జర్నలిస్ట్ అయిన మాయా మీనన్ రుక్సానాకు విషయం తెలియకుండా ఎందుకు దాచింది? తాను చేసిన నేరం నుంచి తప్పించుకోవ డానికి మీనన్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది? నిజాలు తెలుసుకున్న రుక్సానా యజమానికి శిక్ష పడేలా చేసిందా? లేక క్షమించిందా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మీనన్ తల్లి రుక్మిణి (రోహిణి హట్టంగడి), మానసిక అవిటితనంతో బాధపడే కొడుకు ఆయుష్ (సూర్య కాశిభట్ల) నటన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురయ్యేలా చేస్తాయి. విద్యాబాలన్, షెఫాలీ షాలు కథకు బలమైన పిల్లర్లు అని చెప్పొచ్చు. సినిమా చూస్తున్నంతసేపు వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడి నటించారనిపిస్తుంది. యాక్సిడెంట్‌కు ముందు విద్యాబాలన్ బాడీ లాంగ్వేజ్.. తర్వాత ఆమె పడే మానసిక సంఘర్షణ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కూతురు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత షెఫాలీ షా తన నటనలో సీనియారిటీని అద్భుతంగా చూపారు. చివరి వరకు రకరకాల భావోద్వేగాలతో కథ ముగుస్తుంది. ఇదంతా ఈ కథకు ప్లస్‌పాయింట్స్.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో అంత హెవీ డ్రామా సృష్టించిన తర్వాత ఆ గ్రాఫ్‌ను అలాగే కంటిన్యూ చేయడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. మొదటి నుంచి చివరి వరకు అక్కడక్కడా కొన్ని సీన్లు తేలిపోయినట్టు అనిపిస్తాయి. ప్రేక్షకులను నిరాశపరిచే విధంగా సినిమాను సాధారణంగా ముగించినట్లు అనిపిస్తుంది. అలాగే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసే విధానం మరింత బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది.
సినిమా క్వాలిటీపరంగా చూసుకుంటే.. సినిమాని విజువల్‌గా ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాడు. కెమెరామెన్ పనితనం బాగుంది. గౌరవ్ చటర్జీ అందించిన మ్యూజిక్ బాగుంది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ కొత్తగా ఉన్నాయి. అబ్బాస్ దలాల్, హుస్సేన్ దలాల్ డైలాగ్స్ బాగున్నాయి.
- చిత్రం : జల్సా
నటీనటులు : విద్యాబాలన్, షెఫాలీ షా,
రోహిణి హట్టంగడి, సోఫియా ఖాన్,
గుర్పాల్ సింగ్,
సూర్య కాశిభట్ల తదితరులు
దర్శకత్వం : సురేష్ త్రివేణి
నిర్మాతలు : భూషణ్ కుమార్, కిషన్ కుమార్,
సురేష్ త్రివేణి
కథా రచయిత : ప్రజ్వల్ చంద్రశేఖర్, సురేష్ త్రివేణి, హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్
సంగీత దర్శకుడు : గౌరవ్ చటర్జీ
సినిమాటోగ్రఫీ : సౌరభ్ గోస్వామి
ఎడిటర్ : శివకుమార్ వి, పనికర్
విడుదల : మార్చి 18, 2022 (అమెజాన్ ప్రైమ్‌లో)