Sep 08,2022 22:34

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, అండగా ఉండాల్సిన కుటుంబాన్ని అనాధాలుగా మార్చకూడదని, మానసిక ఒత్తిడి, ప్రేమ వైఫల్యం వంటి కారణాలే ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా మారుతున్నాయని మానసిక వికాస నిపుణులు డాక్టర్‌ అయోధ్య కె, డాక్టర్‌ కె.మానస స్పష్టం చేశారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించబడుతున్న వారోత్సవాల్లో భాగంగా కొత్తపేట ఎస్‌కెపివివి హైస్కూల్లో ఇండియన్‌ సైక్రియాట్రి అసోసియేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ పోలీసు విభాగం, స్పందన ఇదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో 'జీవితం యొక్క ఆవశ్యకత' అనే అంశంపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువతలో ఓర్పు, సహనం నశించి విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. మార్కులు తక్కువని కొందరు, ప్రేమించిన వ్యక్తి వల్ల మోసపోయామని మరికొందరు, మొబైల్‌ మాయలో పడి ఇంకొందరు, ఆర్థిక ఇబ్బందులతో మరికొందరు మానసిక రుగ్మతలకు లోనవుతున్నారన్నారు. ఇటువంటి సమయంలో తమ మనసులోని బాధను పంచుకునేందుకు సరైన వ్యక్తి లేడని భావించి మానసిక వ్యధకు గురవటంతో కొంతమంది బలవన్మరణాన్ని పొందుతున్నారన్నారు. స్పందన ఫౌండేషన్‌ కష్ణా జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ఎల్‌.వి.రావు మాట్లాడుతూ ఆత్మహత్యలు లేని భారతదేశాన్ని చూడాలన్నదే తమ ఫౌండేషన్‌ లక్ష్యమన్నారు. దీనికోసం యువత ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు తమ ఫౌండేషన్‌ కషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ జి.శంకరరావు, మహేశ్వరి, పూర్ణిమ, మహిళా ఎస్సై విజయలక్ష్మి, పాఠశాల కార్యదర్శి కే.ఎల్‌.వి మోహన్‌రావు, ప్రధానోపాధ్యాయుడు కంచర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.