Jan 31,2022 08:09
  • పిందెకట్టుగా మారని పూత
  • తోటల కొనుగోలుకు ఆసక్తి చూపని వ్యాపారులు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, చీడపీడలు మామిడి రైతులను దెబ్బతీస్తున్నాయి. నల్లతామర పురుగు దెబ్బకు వచ్చిన పూత రాలిపోతోంది. పూత పిందెకట్టుగా మారకపోవడంతో దిగుబడులు తగ్గిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారులు మామిడి తోటల కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. కృష్ణా జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో 1.70 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇందులో 1.37 లక్షల ఎకరాలు ప్రస్తుతం పూతకు వచ్చాయి. 2021-22 వ్యవసాయ సీజన్‌లో వర్షాలు అధికంగా కురిశాయి. డిసెంబర్‌ పదో తేదీ వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భూమిలోనూ, వాతావరణం లోనూ తేమ అధికంగా ఉండడంతో మామిడికి పూత ఆలస్యమైంది. డిసెంబర్‌, జనవరిలో వచ్చిన పూత పిందెగా మారాలి. ఈ తరుణంలో తామర పురుగు బెడద అధికమైంది. పూతను తామర పురుగు తినేస్తోంది. చెట్టు రసాన్ని పీల్చేసోంది. దీంతో, పూత మాడిపోతోంది. పిందె కట్టడం లేదు. సమస్య తీవ్రత ఉద్యాన పంటల శాస్త్రవేత్తల దృష్టికి వెళ్లింది. రెడ్డిగూడెం మండలం రెడ్డిగుంట గ్రామంలోనూ, నూజివీడు మండలంలోనూ మామిడి తోటలను శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు పరిశీలిం చారు. మిర్చి పంటలు సాగు చేసిన ప్రాంతాల్లోని మామిడి తోటల్లో విదేశీ తామర పురుగులు కనిపించినట్లు ఈ సందర్భంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మిర్చి సున్నితమైన పంటని, ఆ పంటపై విదేశీ తామర పురుగు చూపేటంత తీవ్ర ప్రభావం మామిడిపై ఉండదని వారు చెప్తున్నారు. రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పూత నిలుపుకునేం దుకు ఖరీదైన మందులు పిచికారీ చేస్తున్నారు. ఒక్కో రైతు ఎకరానికి రూ.3 వేలు వెచ్చించి ఇప్పటికే నాలుగు పర్యాయాలు రూ.12 వేలు వరకు ఖర్చు చేసి మందులు పిచికారీ చేశారు. అయినా పిందె నిలవడం లేదని రైతులు తెలిపారు. ఖర్చులు అధికంగా పెట్టినా ఎకరానికి ప్రతి సీజన్‌లో సగటున 5 టన్నుల దిగుబడి వస్తుండగా, ఈ సీజన్‌లో సగానికి తగ్గిపోనుందని ఆందోళన చెందుతు న్నారు. పూత, పిందెలను పరిశీలించి స్థానిక మామిడి వ్యాపారులు ముందస్తుగా ఎకరానికి రూ.50 వేలు నుంచి రూ.80 వేల వరకు రైతులకు నగదు చెల్లించి తోటలు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా నగదు చెల్లించి తోటలు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు.

                                                    నల్లతామర ప్రభావం ఎక్కువ

16 రకాల తామర పురుగులు ఉంటాయి. మిర్చికి వచ్చిన తామర పురుగు అక్కడక్కడా మామిడిలో కనిపిస్తోంది. మామిడి తోటలపై దీని ప్రభావం తక్కువ. నల్లతామర ప్రభావం ఎక్కువగా ఉంది. రీజెంట్‌, జంప్‌, పోలీస్‌, థయోమిథాక్సమ్‌, ఎసిటోమా ఫ్రడ్‌ అనే మందులు మార్చి మార్చి పిచికారీ చేయాలి. పది రోజులకు ఒకసారి వేపనూనె పిచికారీ చేయాలి. కొన్నిచోట్ల విచక్షణారహితంగా పురుగుమందులు ఉపయోగించడం సమస్యగా మారింది. పరపరాగ సంపర్కం జరగక కొన్ని తోటల్లో పిందె కట్టు రావడం లేదు. ఉద్యాన శాఖ అధికారుల సలహాలు రైతులు పాటించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
                                                 - దయాకర్‌బాబు సహాయ సంచాలకులు, ఉద్యాన శాఖ, విజయవాడ

                                                    బంగినపల్లి, రసాల్లో పిందె లేదు

బూరగగూడెంలో ఎనిమిది ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ ఏడాది పూత ఆలస్యమైంది. తామర పురుగు నివారణకు మూడుసార్లు మందులు కొట్టాం. ఒక్కోసారి మందుల పిచికారీకి ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ప్రస్తుతం పూత వచ్చింది. బంగినపల్లి, చెరుకు రసాల్లో వచ్చిన పూత మాడిపోతోంది. పిందె కనిపించడం లేదు. తోతాపురిలో పిందె కనిపిస్తోంది.
                                                        - మద్దిరెడ్డి మాధవరెడ్డి, బూరగగూడెం గ్రామం,
                                                         రంగాపురం పంచాయతీ, రెడ్డిగూడెం మండలం