అధిక వర్షాలతో నిలువని పూత
భారీగా దిగుబడి తగ్గిపోయే అవకాశం
ఆందోళనలలో రైతులు
ప్రజాశక్తి - రాయచోటి: ఫలరాజుగా పేరుగాంచిన మామిడి మూడేళ్లుగా సరైన దిగుబడులు రావడం లేదు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ఏర్పాటు చేయడంతో రైతులందరూ డీలపడ్డారు. గతేడాది ఆశించిన స్థాయిలో మామిడి పంట పండలేదు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడంతో మామిడి పంట అధిక దిగుబడిలో వస్తాయని రైతులు ఆశ పడ్డారు. డిసెంబర్ నెల పూర్తవుతున్న అంతంత మాత్రమే పూత వస్తోంది. అధిక దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చేవారు కూడా లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలతో పూత ఆలస్యం కావడం, అవే వర్షాలు పురుగులు, తెగుళ్లు ఆశించడానికి దోహదపడటంతో..పూత నిలవక, పిందె ఎదగక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.
89 వేల ఎకరాల్లో మామిడి తోటలు
జిల్లాలో 89,657.5 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. జిల్లాల్లో చిట్వేలిలో 4,400 ఎకరాలు, రైల్వేకోడూరులో 9067, ఓబులవారిపల్లిలో 1625, పెనగలూరులో 3380, పుల్లంపేటలో 490, మదనపల్లిలో 1475, నిమ్మనపల్లిలో 2050, రామసముద్రంలో 1500, గుర్రంకొండలో 4145, కలకడలో 3445, కలికిరిలో 2737.5, కె.వి.పల్లిలో 4625, పీలేరులో 3500, వాయల్పడులో 2875, నందలూరులో 1780, రాజంపేటలో 935, టి.సుండుపల్లిలో 7590, వీరబల్లిలో 5262.5, చిన్నమండెంలో 6250, గాలివీడులో 2300, లక్కిరెడ్డిపలిల్లో 6000, రామాపురంలో 3582.5, రాయచోటిలో 222.5, సంబేపల్లిలో 3075, బి.కొత్తకోటలో 715, కురబలకోటలో 750, ములకలచెరువులో 625, పెద్దమండెంలో 1960, పిటిఎంలో 542.5, తంబళ్లపల్లెలో 750 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన దిగుబడులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఈ సారి అధిక వర్షాలు,గాలులతో వాతావరణంలో మార్పులతో దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధిక వర్షాలతో తేమ ఆరక..
అయితే మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్, జూలైలోనే వర్షాలు ప్రారంభమై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కురుస్తాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరివరకూ అధిక వర్షాలు కురిశాయి. నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరక, చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి.
గతంలో నవంబరు నుంచి పూత వస్తుంది. జనవరి వచ్చినా ఇప్పటి వరకు అంతంత మాత్రమే పోతా పూస్తున్నది. కొన్ని రకాల చెట్లలోనే అసలు పూత రాలేదు. వచ్చిన పూత కూడా పొగ మంచు కమ్మేస్తోంది. వచ్చిన పూత కూడా నల్లగా మగ్గిపోతోంది. ప్రతికూల పరిస్థితులతో తేనె మంచు, తామర, పూత తిచే పురుగులు, బూడిద, పూత, మాడు, ఆకుజల్లెడ తెగుళ్ళు వస్తున్నాయి. మూడేళ్లుగా పంటలకు సరైన ఆదాయం రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏడదైనా మామిడి పంట సాగు అధిక దిగుబడులు వచ్చి రైతన్నలకు ఏమాత్రం దిగబడి వస్తుందో వేచి చూడాల్సిందే.
వ్యాపారస్తులతో ఇబ్బందులు
వ్యాపారస్తులు మొదట మామిడి చెట్ల పూత, పిందెలను చూసి కొనుగోలు చేసి అడ్వాన్స్ ఇచ్చి, మామిడికాయలు కోసిన తర్వాత సగం డబ్బులు ఇచ్చి, తర్వాత తమకు నష్టం వస్తుందని సగం డబ్బులతోనే సరిపెట్టుకుంటున్నారు. గతంలో ఈదురుగాలులు, వర్షాలకు మామిడి కొమ్మలు, చెట్లు, మామిడికాయలు నేలపాలవుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వం స్పందించి ఈ ఏడాదైనా ఈదురుగాలులు వర్షాలకు రాలిపోయిన నెలపాలవుతున్న మామిడి చెట్లకు, మామిడికాయలకు నష్ట పరిహారం అందించాలి.
- సుబ్బారెడ్డి, రైతు, యండపల్లి, రాయచోటి.
అధిక ఖర్చవుతోంది
మామిడి చెట్లకు ఏడాది పాటు దుక్కి చేయడం, చెట్లకు పాదులు తీయడం, మామిడి కొమ్మలు కత్తిరింపులు, ఎరువులు, మందులు, కూలీలు ,తోటకు కంచే అధిక ఖర్చులు అవుతున్నాయి. మామిడి పంట మాత్రం అంతంతే వస్తుంది. మందులు, ఎరువులు అధిక రేట్లను ప్రభుత్వం తగ్గించాలి.
- సుబ్రహ్మణ్యం, రైతు పీలేరు.
రైతులు ఆందోళన చెందొద్దు
గత సంవత్సరం మామిడి పంట సరిగ్గా రాలేదు. ఏడాది మామిడి పంట అధికంగా వస్తుంది. మామిడి పూత గత సంవత్సరం ముందస్తుగా పూసింది. ఏడాది జనవరి మొదటి వారం లోపల పూర్తిగా మామిడి పూత వస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మామిడి తోటల్లో పూత సీజన్ ప్రారంభ మైంది. జిల్లాలో కొన్నిచోట్ల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించి రైతుల్లో చైతన్యం చేస్తున్నాం. మామిడి పంట అధికంగా ఉన్న గ్రామాలను గుర్తించి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. నాణ్యమైన దిగుబడి రావడానికి నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నాం.
-పి.రవి చంద్రబాబు, జిల్లా ఉద్యాన శాఖాధికారి, రాయచోటి.










