పనుకొండ : తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గెలిచిన వార్డుల్లో అభివృద్ధి పనులు చేయకుండా ఛైర్మన్ వివక్ష చూపుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని టిడిపి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని కౌన్సిల్ హాల్‌లో నగర పంచాయతీ అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని ఛైర్మన్ ఉమర్ ఫరూక్ అధ్యక్షతన నగర పంచాయతీ అత్యవసర సమాశాన్ని కమిషనర్ వంశీకష్ణభార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో వైస్‌ఛైర్మన్ సునీల్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా అజెండాలోని అంశాలను కౌన్సిల్ సమావేశంలో అధికారులు చదివి వినిపించారు. అనంతరం వైసిపి వార్డు కౌన్సిలర్ రఘునాథరెడ్డి అజెండాలోని అంశాలను ఆమోదిస్తూ తీర్మానించగా, మిగిలిన వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో టిడిపి వార్డు కౌన్సిలర్లు శోభన్ సప్తగిరి, గీతా హనుమంతులు మాట్లాడుతూ తమ వార్డుల్లో అభివద్ధిని ఆపేశారన్నారు. సీసీ రోడ్ల, వీధిలైట్లు తదితర సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇందుకు స్పందించిన ఛైర్మన్ మాట్లాడుతూ అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి పనులను చేస్తున్నామని చెప్పారు. టిడిపి కౌన్సిలర్లు జరిగిన అభివృద్ధిని తామే చూపిస్తామని కావాలంటే వార్డులోకి రావాలని సూచించారు. సమావేశంలో అభివృద్ధి అంశంపై టిడిపి, వైసిపి కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అనంతరం కమిషనర్ వంశీకష్ణ భార్గవ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదన్నారు. కౌన్సిలర్లు ఈ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని కోరారు. ఈ నెలలో జరగనున్న బాబయ్య స్వామి ఉరుసుకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తయూబ్, సద్దాం, భాస్కర్ నాయక్, బోయ హారతి బాబు, అంజలి శ్రీరాములు, నాగరత్న గణేష్, ఫర్‌జియా బాను, షాబీనా, లావణ్య, చంద్రకళ, సంజీవమ్మ కో ఆప్షన్ సభ్యులు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.










