Jul 07,2021 11:12

హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా) ఎన్నికల వ్యవహారంలో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో చెప్పినట్టుగా సెప్టెంబర్‌లో జరగాల్సిన మా ఎన్నికలు జరుగుతాయా ? వాయిదా పడతాయా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 'మా' సాంప్రదాయం ప్రకారం.. ఇంచుమించుగా రెండేళ్లకు ఒకసారి 'మా' ఎన్నికలు జరగాలి. ఆ ప్రకారం.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల 'మా' ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ నటుడు ప్రకాష్‌రాజ్‌ 'మా' అధ్యక్షుడికి ఏప్రిల్‌లో ఒక లేఖ రాశారు. ఆ లేఖకు... 2019లో ఆమోదించిన ఒక తీర్మానం ప్రకారం ఎన్నికలను సెప్టెంబర్‌లో జరపవచ్చని 'మా' కార్యవర్గం దీనికి సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రకాష్‌ రాజ్‌ తన ప్యానల్‌ను ప్రకటించారు. మంచువిష్ణు, జీవిత, హేమ కూడా రంగంలోకి దిగారు.

ఈసీ ని వాయిదా వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి..
వాస్తవానికి ఈ నెల 9 న మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌ జరగాల్సి ఉంది. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ.. 'మా' ఆఫీసులో సిబ్బందికి కోవిడ్‌ రావటంతో ఆ భేటీ జరిగే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. ''ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై ఈసీనే నిర్ణయం తీసుకోవాలి. ఈసీ సమావేశమే జరగకపోతే.. ఎన్నికల తేదీపై స్పష్టత రాదు. ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసీని వాయిదా వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి అని పేరు చెప్పటానికి ఇష్టపడని 'మా' సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో అనేక సొసైటీలు తమ సమావేశాలను, ఎన్నికలను ఆన్‌లైన్‌ ద్వారా జరుపుకొంటున్నాయి.

కొత్త కార్యవర్గం వచ్చేవరకు పాత కార్యవర్గమే కొనసాగుతుంది : మా లీగల్‌ ఒపీనియన్‌
2019లో ఆమోదించిన తీర్మానంపైన, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాలను వాయిదా వేసే హక్కు అధ్యక్షుడికి ఉందా? లేదా? అనే అంశంపైన, కార్యవర్గం పదవీకాలంపైన కొందరు సభ్యులు 'మా' కార్యవర్గానికి లేఖలు రాశారు. దీనిపై మా లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంది. అన్యాపదేశంగా.. సొసైటీస్‌ యాక్ట్‌ ప్రకారం, ఒకసారి ఎన్నికైన కార్యవర్గం ఆరేళ్లదాకా కొనసాగొచ్చనే అర్థం వచ్చేలా మా లీగల్‌ అడ్వైజర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదే విషయాన్ని 'మా' తన సభ్యులకు తెలిపినట్టు సమాచారం.
      ''టీఎస్‌ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌, 2001 ప్రకారం ఒక కార్యవర్గం ఎన్నికైన తర్వాత గరిష్ఠంగా ఆరేళ్ల కాలం ఉండొచ్చు. మా బైలాస్‌లో ఎక్కడా ఒక కార్యవర్గం ఎన్నికైన తర్వాత నిర్దిష్టంగా ఇంతకాలం ఉండాలని లేదు. 28 ఏళ్లుగా ఉన్న సాంప్రదాయం ప్రకారం ఒక కార్యవర్గం ఒక ఎన్నిక నుంచి మరొక ఎన్నిక వరకు కొనసాగుతుంది. కాబట్టి.. కొత్త కార్యవర్గం ఎన్నికై అధికారాలు చేపట్టే వరకు ప్రస్తుత కార్యవర్గం పూర్తి అధికారాలతో కొనసాగుతుంది'' అని లీగల్‌ అడ్వైజర్‌ తన అభిప్రాయాన్ని తెలిపారు.

2019 లో ఆమోదించిన తీర్మానం చెల్లదు : కార్యవర్గం
'''మా' ఎన్నికలను సెప్టెంబర్‌లో జరపటానికి వీలుగా 2019 లో ఆమోదించిన తీర్మానం చెల్లదు'' అని కార్యవర్గం మా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీటన్నిటిబట్టి చూస్తే.. ఎన్నికలు గతంలో తీర్మానం చేసినట్టు సెప్టెంబరులో కూడా జరపకపోవచ్చని, వాటిని మరికొంతకాలంపాటు వాయిదా వేయాలని ప్రస్తుత కమిటీ భావిస్తోందని అనుమానాలు కలుగుతున్నాయి.

సందేహాస్పదమే...
ఎన్నికైన కార్యవర్గం నిర్దిష్టంగా రెండేళ్లు మాత్రమే ఉండాలని బైలాస్‌లో లేదు. కొన్నిసార్లు రెండేళ్ల మూడు నెలల తర్వాత, మరికొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కాలం తర్వాత.. ఎన్నికలు జరుగుతూ వచ్చాయి తప్ప రెండేళ్లకొకసారి ఎన్నికలు జరగట్లేదు. సెప్టెంబరులో ఎన్నికలు జరపాలంటూ గత ఏడాది తీర్మానం తీసుకున్న వార్షిక జనరల్‌ బాడీ మీటింగ్‌ జరగాలంటే దానికి ముందు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) భేటీ నిర్వహించి, తీర్మానం చేయాలి. కానీ.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మీటింగ్‌ జరక్కుండానే ఎజిఎం సమావేశం జరిగిందని మా లీగల్‌ అడ్వైజర్‌ తన ఒపీనియన్‌లో పేర్కొన్నారు. అంటే దాని చెల్లుబాటు కూడా సందేహాస్పదమే.