మా భూములిప్పించండి సారూ..!
- తహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన
- ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని కండ్రిక గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన నాయకులు తమ భూములను కబ్జా చేశారని తమ భూములను తమకే ఇప్పించాలని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 1976వ సంవత్సరంలో 898,899,900గ్రామ సర్వేనెంబర్‌లోని సిజెఎఫ్‌ఎస్ భూములను ఒక్కో రైతుకు 2.50నుండి 3ఎకరాల వరకు సెంట్రల్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ (ఆర్‌డిఒ) డీ ఫారాలు మంజూరు చేశారని తెలిపారు. అప్పటి నుండి తాము సాగుచేసుకుంటూ తమ అధీనంలో ఉన్నాయని రైతులు తెలియజేశారు. 2012లో భూ కబ్జా దారులు ఆక్రమించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు. 2018లో అప్పటి ఆర్‌డిఒ రైతులకు నోటీసులు అందజేసి సిజెఎఫ్‌ఎస్ భూములను రద్దుచేసి ప్రభుత్వ భూముల కింద కొందరికి పట్టాలు మంజూరు చేయగా, మరికొందరికి ఇవ్వలేదని అప్పటినుండి ఇప్పటివరకు భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ భూములు నెల్లూరు-ముంబై జాతీయ రహదారికి పక్కనే ఉండి అధిక ధరలు ఉండడంతో భూములపై అధికార పార్టీ నాయకుడు కన్నేసి తమను ఇబ్బందులకు గురిచేస్తూ, భూముల్లోకి వెళ్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఇదే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి, భూమి పత్రాలు చూపగా, పొలం చేసుకోండని తెలిపారు. అయిననూ కబ్జాదారులు వేధిస్తుండగా పలుమార్లు తహశీల్దార్‌ను కలువగా పిలిపించి న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికీ పట్టించుకోలేదన్నారు. తమ భూములు ఇప్పించి, ఆక్రమణదారునిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.










