Oct 06,2023 16:15

ప్రజాశక్తి-విజయవాడ : శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసితుల సమస్యపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేయాలని నిర్ణయించారు. ఈ ధర్నాకు వెళ్ళనీయకుండా వామపక్ష పార్టీల నాయకులను, ప్రజాసంఘాల కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈ మేరకు వామపక్షాలు పత్రికా ప్రకటన విడుదల చేశాయి. అరెస్టయిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, జి.సింహాచలం సీనియర్‌ నాయకులు కె.శ్రీనివాస్‌, సిపిఐ సీనియర్‌ నాయకులు సుందరలాల్‌, చాపర వెంకటరమణ, సిపిఐ(యంఎల్‌) న్యూడెమోక్రసీ తాండ్ర ప్రకాష్‌, కాంగ్రెస్‌ నాయకులు పేడాడ పరమేశ్వరరావు తదితరులున్నారు. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని కోరాయి. పోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామిమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశాయి.