ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లె 2021-22లో విస్తత సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు అవార్డుల పంట పండింది. మంగళవారం సొసైటీ కాలనీలోని లయన్స్ కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లయన్స్ క్లబ్ ఎడిసిఎస్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 7వ తేదీ కర్ణాటక రాజధాని, బెంగళూరు నగరంలోని కోరమంగళ క్లబ్ కన్వెన్షన్ హాల్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగిందన్నారు. సేవా కార్యక్రమాలను ప్రామాణికంగా తీసుకొని ఈ అవార్డులను అందజేసినట్లు తెలిపారు. జిల్లాలోని బెస్ట్ రూరల్ క్లబ్ అవార్డు, బెస్ట్ విజన్ కేర్ అవార్డు, బెస్ట్ హంగ్ రిలీఫ్ అవార్డు, బెస్ట్ లయన్స్ ఐ హాస్పిటల్ అవార్డుతోపాటు పశువైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాల ఏర్పాటు చేసినందుకు మొత్తం 13 అవార్డులను అందుకొని జిల్లాలోని మొదటి స్థానం నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఇన్ని అవార్డులు కైవసం చేసుకోవడం జిల్లాలోనే ఇదే ప్రథమమన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన లయన్స్ ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డును ఎడిసిఎస్ లయన్ గౌతమ్‌రెడ్డి అందుకోవడం గర్వకారణమన్నారు. లయన్స్ క్లబ్ సేవలు గ్రామ, గ్రామాన విస్తరించడమే లక్ష్యమన్నారు. అంధత్వ నివారణే లక్ష్యంగా వేలాది మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరిన్ని అవార్డులను కైవసం చేసుకోవడం తమ ముందున్న ఏకైక లక్ష్యమన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు లయన్ మార్పూరి మహేష్, లయన్స్ సర్వీస్ ట్రస్ట్ సెక్రటరీ లయన్ కెఎస్‌ఎస్ ప్రసాద్, ఎడిసిటి బాబూలాల్ భండారీ, లయన్ భాస్కర్ నాయుడు, లయన్ లియో భవేష్ పాల్గొన్నారు.










