అనంతపురం ప్రతినిధి : దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వ్యవసాయం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. నిత్యం కరువులకు నిలయమైన ఈ ప్రాంతం నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు అధికంగా ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న ఆకాంక్ష బలంగా ఉన్నా, ఆచరణలో మాత్రం ఇది కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లాల పరిధిలో వెయ్యి మందికిపై ఉపాధి కల్పించే పరిశ్రమ ఒక్కటీ లేదన్నది నిష్టూర సత్యం. స్థానికంగా ఏర్పాటు చేయాలనుకున్న పరిశ్రమలు సైతం పక్క జిల్లాలకు తరలిపోతుండడం గమనార్హం. ఇవి ఎందుకు పక్క జిల్లాలకు తరలి వెళ్తున్నాయి.? లోపం ఎక్కడుందన్న విషయాన్ని తెలపాల్సిన పాలకులు, అధికారులు దీనిపై నోరు మెదపకున్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో దశాబ్ధాల తరువాత 2014లో పెనుకొండ వద్ద ఏర్పాటైన కియా కార్ల తయారీ పరిశ్రమే అతి పెద్దది. అది వచ్చాక అనేక అనుబంధ సంస్థలూ వచ్చాయి. సుమారు 20 వేల మందికి ఉపాధి ఈ పరిశ్రమ ద్వారా కలుగుతోంది. ఇది చూసి మరిన్ని పరిశ్రమలు ఇటువైపు వస్తాయన్న నమ్మకమూ అందరిలో కలిగింది. అందుకు తగ్గట్టుగానే కొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. సత్యసాయి జిల్లా సరిహద్దులోని కొడికొండ నుంచి ఇటు అనంతపురం వరకు జాతీయ రహదారి వెంట పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తుందన్న నమ్మకమూ జిల్లా వాసుల్లో కలిగింది. 2019 నుంచి చూస్తే పారిశ్రామికాభివృద్ధి దాఖలాలు ఒక్కటీ కనిపించకుండా పోయాయి. అంతకు ముందే వస్తాయని భావించిన పరిశ్రమలూ ఇక్కడ ఏర్పాటవకుండానే పక్క జిల్లాకు తరలి వెళ్లడం అందరినీ నిరాశకు గురిచేస్తోంది.
వచ్చినట్టే వచ్చి పక్కకెళ్లిన పరిశ్రమలు
2019కి ముందే కొన్ని పరిశ్రమలు జిల్లాకు రావడానికి సుముఖత వ్యక్తం చేశాయి. అందులో కనగానపల్లి మండలం దాదులూరు వద్ద జెఎస్‌డబ్ల్యూ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. ఇందుకోసం 600 ఎకరాల భూమిని కూడా ఎపిఐఐసి పరిశ్రమ చూసి పెట్టింది. ప్రాథమిక దశలో ఆ పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు సాగింది. అయితే మధ్యలో ఏమైందో తెలియదుగానీ, ఇప్పుడు ఆ పరిశ్రమ కడప జిల్లాకు తరలి వెళ్లింది. ఇది ఏర్పాటయితే అటు కియా, ఇటు జెఎస్‌డబ్ల్యూ ఉక్కు పరిశ్రమ రావడంతో పెద్దఎత్తున పారిశ్రామికాభివృద్ధి సాగుతుందని ప్రజలు భావించారు. చివరి నిమిషంలో అది మారిపోయింది. ఇక జాకీ పరిశ్రమ ఏర్పాటుకు పనులు ప్రారంభించి చివరి నిమిషంలో అది కూడా పక్కకు వెళ్లింది. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయలేమంటూ జాకీ యాజమాన్యం ఎపిఐఐసికి ఒక ఉత్తరాన్ని అందజేసి వెళ్లిపోయింది. పరిశ్రమ ఏర్పాటు చేయకుండా వారి వెళ్లిపోతున్నా, ఇక్కడే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ స్థాయిలో ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన మరో రెండు భారీ టెక్స్‌టైల్స్ పరిశ్రమలు కూడా స్థల పరిశీలన జరిపి ఎంఒయు సమయంలో కడప జిల్లాకు వెళ్లాయి. జిల్లాలో ఏర్పాటు కావాల్సిన టెక్స్‌టైల్స్ పరిశ్రమలూ రాకుండా పోయాయి. చిలమత్తూరు మండలంలోనే గతంలో ఏర్పాటు చేస్తామన్న ఎయిర్‌బస్, వీరవాహాన్‌తో పాటు పలు పరిశ్రమల పేర్లు వినిపించినప్పటికీ ఏర్పాటు జరిగే వరకు సందేహాలు మాత్రం వీడటం లేదు. ఈ రకంగా జిల్లాకు వస్తాయనుకున్న పెద్ద పరిశ్రమలు రాకుండానే పక్కకు తప్పుకున్నాయి.
వికేంద్రీకరణ మాటల్లోనేనా.?
గత కొద్ది రోజులు అభివృద్ధి వికేంద్రీకరణపై పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది. అభివృద్ధి వికేందీక్రరణ ద్వారా జరిగే అభివృద్ధిపై మాత్రం చర్చ జరగడం లేదని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పరిశ్రమలుగాని, సాగునీటి ప్రాజెక్టులుగా వచ్చిందేమి లేదన్న విమర్శిస్తున్నారు. కనీసం వికేంద్రీకరణ ద్వారా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక కూడా ప్రభుత్వం వైపు నుంచి ప్రకటించలేదని ప్రశ్నిస్తున్నారు.










