ప్రజాశక్తి-ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ : లోకేష్ యువగళం పాదయాత్ర 113వ రోజు ప్రొద్దుటూరులో గురువారం రాత్రి బహిరంగ సభ అనంతరం వైసిపి మూకలు రెచ్చిపోయారు. లోకేష్‌పై వైసిపి కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివాలయం సెంటరులో బహిరంగసభ అనంతరం ఆయన మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్ మీదుగా కొత్తపల్లి పిఎన్‌ఆర్ ఎస్టేట్ వద్ద విడిది కేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్ పెట్రోలు బంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసిపి కార్యకర్త లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టిడిపి నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టిడిపి కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సిఐ రాజారెడ్డిని లోకేష్ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు. మీరు ఫ్లెక్సీలు చించారంటూ సిఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.










