అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేసిన 'లెజియన్ ఆఫ్ మెరిట్' అవార్డు గురించి సమాచారం కొంత ఆసక్తికరంగా వుంటుంది. అమెరికా అధ్యక్షుడు అందజేసే ఈ అవార్డు, ప్రాథమికంగా ఒక సైనిక పురస్కారం. చీఫ్ కమాండర్ కేటగిరీ అయిన దీన్ని గతంలో ఇతర దేశాల సాయుధ బలగాల ఆర్మీ చీఫ్‌లకు, జనరల్స్‌కు, కమాండర్ ఇన్ చీఫ్ లకు అందజేసేవారు. చాలా కొద్ది మంది దేశాధినేతలకు లేదా ప్రభుత్వాధినేతలకు, మరీ ముఖ్యంగా అమెరికాకు సైనికంగా అత్యంత సన్నిహిత మిత్రులకు మాత్రమే ఈ అవార్డు ఇచ్చారు. గత 29 ఏళ్ళలో అమెరికాకు వెలుపల ఏ ఒక్కరికీ ఈ అవార్డు ప్రదానం చేయలేదు. వాస్తవానికి, అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన 'ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్'ను 1963లో నెలకొల్పారు. వరుసగా వచ్చిన అమెరికా అధ్యక్షులందరూ విదేశీ నేతలకు, విశిష్ట వ్యక్తులకు ఈ అవార్డును అందచేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అవార్డు 1985లో భారతీయ పౌరురాలైన మదర్ థెరిస్సాకు అందజేేశారు.
కానీ, ట్రంప్, మోడీకి అందజేసింది ప్రత్యేకంగా సైనిక పురస్కారం. ''ప్రపంచ సవాళ్ళను ఎదుర్కొనేందుకు అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందడానికి మోడీ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందచేస్తున్నట్లు ఆ ప్రశంసా పత్రం పేర్కొంటోంది. అమెరికా సైనిక మిత్రపక్షంగా మోడీ కొత్తగా సాధించిన పదవికి ఇదొక గుర్తింపు. భారత ప్రధానిగా మోడీ విశిష్టమైన సేవలందించారని ఆ ప్రశంసా పత్రం పేర్కొంది. లాజిస్టిక్స్ సప్లై అగ్రిమెంట్ (ఎల్‌ఇఎంఓఎ), ఆ తర్వాత మరో రెండు ప్రాథమిక ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా అమెరికా సైనిక మిత్రపక్షంగా భారత్ మారడంలో మోడీ నిర్ణయాత్మక పాత్ర పోషించారని అమెరికా భావిస్తోంది.
ఇటీవల వరకు జపాన్ ప్రధానిగా చేసిన షింజో అబె, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ లకు కూడా ఏక కాలంలో ఈ పురస్కారాన్ని ట్రంప్ ప్రదానం చేశారు. అమెరికా నేతృత్వం లోని నాలుగు దేశాల కూటమి (క్వాడ్)లో చేరేందుకు తమ దేశాలను ముందుంచడంలో ఈ ముగ్గురు కీలకంగా పని చేశారు. క్వాడ్ ను సైనిక కూటమిగా పెంటగన్ భావిస్తోంది. ట్రంప్‌తో సైనిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నందుకు ఈ లెజియన్ మెడల్ అనేది ముగ్గురు నేతలకు గుర్తింపు వంటిదనుకుంటే అంతకన్నా కీలకమైన అంశం మరొకటి వుంది. ఈ ముగ్గురూ ట్రంప్‌తో తమ సన్నిహిత రాజకీయ అనుబంధాన్ని వ్యక్తం చేసిన మితవాద నాయకులే.
2019 సెప్టెంబరులో హూస్టన్ ర్యాలీలో మోడీని ట్రంప్ ధ్రువీకరించగా, అదే నెలలో ఓహియోలో జరిగిన ట్రంప్ ర్యాలీకి మోరిసన్ హాజరయ్యారు. హూస్టన్‌లో ''అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్'' (ఈసారి ప్రభుత్వం ట్రంప్‌దే) అని మోడీ పునరుద్ఘాటిస్తే, మోరిసన్ మరింత చురుకైన వ్యక్తి. ట్రంప్ తిరిగి ఎన్నికవడం గురించి ప్రశ్నించగా ''మేం ఒకే రకమైన అభిప్రాయాలు పంచుకుంటాం.'' అని ప్రకటించారు. ఇక షింజో అబెకు ట్రంప్‌తో చాలా సన్నిహితమైన వ్యక్తిగత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి గోల్ఫ్ ఆడతారు.
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సనారో వంటి తన సైద్ధాంతిక సహచరులకు ట్రంప్ ఈ అవార్డు ఇవ్వలేదంటే కొత్తగా, ప్రధానంగా సైనికంగా మిత్రపక్షాలకే ఈ అవార్డులు ఇవ్వాలన్నది పెంటగన్ నిర్ణయంగా వుందని స్పష్టమవుతోంది. శ్వేతసౌధం వీడి వెళ్లడానికి ఇక కొద్ది రోజులే గడువు వున్న సమయంలో, ట్రంప్ పలువురికి క్షమాభిక్ష పెట్టారు. వీరిలో క్రిమినల్ కేసుల్లో దోషులైన ట్రంప్ మాజీ సలహాదారు మైఖేల్ ఫ్లైయిన్ వుంటి వారున్నారు. తన సహచరులను చాలామందిని ఉన్నత పదవుల్లో ట్రంప్ నియమించారు. విదేశాల్లో వున్న తన రాజకీయ మిత్రులను కూడా ట్రంప్ మరిచిపోలేదు.
అధ్యక్షుడు ట్రంప్ ఈ అవార్డుతో తనను గొప్పగా గౌరవించారని మోడీ వ్యాఖ్యానించారు. తాను అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవడానికి కృషి చేస్తానని 130 కోట్ల మంది భారత ప్రజల తరపున మోడీ హామీ ఇచ్చారు. అయితే, ఈ అమెరికన్ అవార్డు నేపథ్యం గురించి మోడీకి పూర్తి సమాచారం తెలిసినట్లుగా కనిపించడం లేదు. ఈ అవార్డును గతంలో ఇద్దరే ఇద్దరు భారతీయులు ఫీల్డ్ మార్షల్ కరియప్ప, జనరల్ ఎస్.ఎం.శ్రీనగేష్‌లు వరుసగా 1950, 1955ల్లో అందుకున్నారు. వీరిద్దరూ ఆర్మీ చీఫ్‌లే. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ సైన్యం తరపున పోరాడారు. ఆ రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల చీఫ్‌లకు లెజియల్ మెడల్ అందజేసేవారు. అలా అందుకున్న వారిలో నేపాల్ ఆర్మీ చీఫ్ కూడా వున్నారు.
మూడు దశాబ్దాలుగా ఈ అవార్డును ఎవరికీ ఇవ్వలేదు. ఇప్పుడు ట్రంప్ అకస్మాత్తుగా, ఆ అవార్డును విదేశీ నేతలకు అందజేయడాన్ని పునరుద్ధరించారు. ఈ ఏడాది సెప్టెంబరులో కువైట్ చివరి చక్రవర్తికి అందజేశారు. ట్రంప్‌కు సంబంధించినంతవరకు, ఈ అవార్డును ఇవ్వడమంటే చైనాపై పోరులో సహకరించిన తన మిత్రపక్షాలకు తన పదవీ కాలం చివరిలో చెప్పుకున్న కృతజ్ఞత వంటిదే. పెంటగన్‌కి అయితే ఈ సైనిక కూటమిని మరింత పటిష్టపరచాలన్నది లక్ష్యంగా వుంది. అయినప్పటికీ, ఈ పురస్కారం పట్ల మోడీ సంతోషం వ్యక్తం చేయడమంటే దురదృష్టవశాత్తూ, భారత్, అమెరికాకు లంగి వుండే సైనిక మిత్రపక్షంగా మారిందనే వాస్తవాన్ని గుర్తించడమే కాగలదు.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)










