Oct 09,2023 10:41

ప్రజాశక్తి-ఉండి: పని ఒత్తిడి తట్టుకోలేక గ్రామ సర్వేయర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం జల్లి కాకినాడలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జల్లి కాకినాడకు చెందిన అద్దేపల్లి నాగేశ్వరరావు ద్వితీయ కుమారుడు అద్దేపల్లి దుర్గా రామ గుప్త(25) సచివాలయ సర్వేయర్ గా ఉండి మండలం కోలమూరు లో పనిచేస్తుండగా ఆదివారం అర్ధరాత్రి పని ఒత్తిడి కారణంగా ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు అతని బంధువులు తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ రీసర్వే కారణంగా ఆదివారం కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని దీంతో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని ఇటీవల అతను చర్చించినట్లు పలువురు తెలిపారు. రీ సర్వే పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి ఎక్కువైన కారణంగా ఆదివారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. యండగండి ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాబోలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వలన కుటుంబం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పని ఒత్తిడి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందని మరణమే దానికి సమాధానం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఆయన కోరారు. అతని మరణానికి యండగండి ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ సభ్యులు సంతాపం, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.