న్యూఢిల్లీ : భారత్‌లోని బడా సమాచార సాంకేతిక (ఐటి) కంపెనీలు టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు... లక్షల్లో కొలువులనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వివిధ ప్రాంగణ ఎంపికల ద్వారా 2022 నాటికి ఫ్రెషర్లకు ఉద్యోగాలనివ్వనున్నాయి. ఇవన్నీ తమ త్రైమాసిక డేటాను అనుసరించి వెల్లడించాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పటికీ ఈ సంస్థలు వేలల్లో కొలువులనిచ్చాయి. జూన్ నాటి త్రైమాసిక గణాంకాలను బట్టి చూస్తే... విప్రో సుమారు 12 వేల మందిని నియమించగా... ఇన్ఫోసిస్ 8,300 ఉద్యోగులను, టిసిఎస్ 20 వేల ఉద్యోగులను నియమించింది.
టాటా నియామకాలు : 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంగణ ఎంపికల ద్వారా 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని టాటా కన్సెల్టెన్నీ సర్వీస్ ప్రణాళిక చేస్తోంది. 2020లో 40 వేల ఉద్యోగాలనిచ్చిన ఈ సంస్థలో ఇప్పటి వరకు 5 లక్షల మంది ఉద్యోగులు వున్నారు.
ఇన్ఫోసిస్ : ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కళాశాల విద్యను పూర్తి చేసిన వారిలో 35 వేల మందిని నియమించుకోవాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది. మార్చి త్రైమాసికంలో 2.59 లక్షల మంది ఉద్యోగులు ఉండగా... జూన్ త్రైమాసికానికి 2.67 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ వెల్లడించింది.
విప్రో : ఇక విప్రో ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి 12 వేల ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పింది. ముగిసే ఆర్థిక సంవత్సరం నాటికి 30 వేల మంది ఫ్రెషర్లకు కొలువులిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొంటోంది.










