అన్నమయ్య, కడప జిల్లాల డిఇఒలు
ప్రజాశక్తి - కడప అర్బన్ : ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి పాఠశాలలో లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) తప్పనిసరిగా అమలు చేయాలని అన్నమయ్య, వైఎస్‌ఆర్ జిల్లాల డీఈవోలు రాఘవ రెడ్డి, దేవరాజు పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణ పొందిన మండల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యాయులు డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్‌లకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్, ప్రభుత్వ, నగరపాలక, ఎయిడెడ్, ఇతర ప్రభుత్వ యాజమాన్యాలలో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు తప్పనిసరిగా లిప్‌ను ప్రతి పాఠశాలలో అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడూ ఉప విద్యాశాఖ అధికారులు వీటిపై సమగ్ర నివేదికను డీఈవో కార్యాలయానికి చేరవేయాలని ఆదేశించారు. బుక్కపట్నం డైట్ ప్రిన్సిపల్ రామకష్ణ మాట్లాడుతూ లిప్‌ను అమలు చేయడం వల్ల విద్యార్థులలో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాలపై చదవడం, రాయడం సరళంగా నేర్చుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. భాష పై పట్టు రావడం వల్ల మిగిలిన సబ్జెక్టులలో సులభంగా విద్యాభ్యాసం చేస్తారని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర రిసోర్స్ గ్రూప్ సభ్యులు లర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కడప డిప్యూటీ డిఇఒ రాజగోపాల్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, కడప ఎంఇఒ పాలెం నారాయణ, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.










