Mar 15,2023 21:59

ఫ్యాక్టరీ యజమాని ఇంటిముందు ఆందళన చేస్తున్న రైతులు, నాయకులు

ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల పరిధిలోని రావు బహదూర్‌ శ్రీరామ్‌ నర్సింగ్‌ దాస్‌ అనే ప్రైవేట్‌ కంకర ఫ్యాక్టరీ యజమానులు రైతులకు నాలుగు సంవత్సరాలుగా లీజు ఒప్పందం ప్రకారం చెల్లించవలసిన లీజు డబ్బులు చెల్లించాలని వ్యవసాయ కార్మికసంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కమిటీ సభ్యులు బాలస్వామి అధ్యక్షతన రైతులతో కలిసి బుధవారం ఫ్యాక్టరీ యజమాని ఇంటి ముందర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దన్న మాట్లాడుతూ క్వారీ ఏర్పాటు నిమిత్తం నల్లగొండ రాయన పల్లె గ్రామానికి చెందిన నిరుపేద రైతులు 26 మందితో 20 ఎకరాలు 2017 సంవత్సరంలో క్వారీ యాజమాన్యం లీజు ఒప్పందం చేసుకుందనానరు. 10 సంవత్సరాల పాటు ఒక ఎకరానికి సంవత్సరానికి 50వేల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 5 శాతం పెంచుకునే విధంగా లీజు ఒప్పందం చేసుకున్నారనానరు. ఈ ఒప్పందాన్ని క్వారీ యాజమాన్యం మొదటి మూడు సంవత్సరాలు అమలు చేసిందన్నారు. అయితే గత 4 సంవత్సరాల నుండి రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఒప్పందం ప్రకారం బకాయి ఉన్న పరిహారాన్ని చెల్లించాలని రైతులు ఎన్నిసార్లు కోరినా క్వారీ యాజమానీ చౌదరి స్పందించలేదన్నారు. దీంతో రైతులతో కలిసి ఆందోళకు దిగాల్సి వచ్చిందన్నారు. విషయం తెలుసుకున్న ఎఎస్‌ఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్వారీ యజమాని రైతులతో సంప్రదింపులు జరిపారు. ఏప్రిల్‌ 7వ తేదీ లోపు నష్టపరిహారం రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశులు, సుబ్బరాయుడు, చిన్నకిష్టప్ప, కాలప్ప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.