Mar 28,2023 22:33

జెసిబితో లేఅవుట్‌లో రాళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - మడకశిర : లేఅవుట్‌ ఏర్పాటులో లెక్క తప్పడంతో నగర పంచాయతీ అధికారులు ఒక అడుగు ముందుకు వేసి అక్రమ లేఅవుట్లు అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చి రాళ్లు పెకిలించిన సంఘటన పట్టణంలో కలకలం సృష్టించింది. ముఖ్యంగా ఈ వివాదం రగులుకోవడానికి ఓ కౌన్సిలర్‌ నిర్వాకమే అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పట్టణంలో సక్రమానికి ఏది అనుమతి ఇవ్వరు అక్రమానికి మాత్రం అన్ని తామే ముందుండి నడిపిస్తారు అన్న అభిప్రాయాలు ప్రజల్లో నాటుకుపోయాయి. మున్సిపల్‌ పరిధిలో లేఅవుట్లు వేయాలన్న సొంతంగా ఇల్లు , వ్యాపార సమూదాయ భవనాలు నిర్మించుకోవాలన్న లక్షలాది రూపాయలు ముడుపులు చెల్లిస్తే తప్ప అనుమతులు లభించవన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఒకవేళ అనుమతి ఇచ్చిన తొలుత అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్ని ప్రసన్నం చేసుకొని పనులు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పాలకపక్షనేతకు సంబంధించిన కుటుంబ సభ్యుడు ఆదిరెడ్డి పాలెం వద్ద ఆధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్‌ అధికారులు ఉన్న ఫలంగా వెళ్లి జెసిబి తో లేవుట్లలోని రాళ్ళను పెకిలించి వేయడంతో దుమారం చెలరేగింది. లేఅవుట్‌ నిర్మాణ దశలోని లక్షలాది రూపాయలు ముట్టజెప్పాలని ఆదిలోనే మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం . ఆ ప్రాంతానికి చెందిన ఓ కౌన్సిలర్‌ ఈ విషయంలో జోక్యం చేసుకొని ముడుపులు చెల్లించలేని పరిస్థితి ఎదురైతే పరోక్షంగా తమకు మూడు సైట్లను కేటాయించాలని బేరం పెట్టినట్లు సమాచారం. లేఅవుట్‌ నిర్వాహకుడు రెండు చేయలేనని కానీ నిర్ణీత ధర కంటే తక్కువగా మూడు సైట్లను ముట్టజెప్పుతానని పేర్కొనడంతో లెక్క తప్పింది, వేటు పడిందన్న వాదనలు వినపడుతున్నాయి. మొత్తం మీద బేరం కుదరకపోవడంతో ఆ ప్రాంత కౌన్సిలర్‌ అధికారులపై ఒత్తిడి తేవడంతో కమిషనర్‌ ఆగమేఘాలపై జెసిబి తో వెళ్లి లేఅవుట్లలోని రాళ్లను తొలగించే పక్రియ చేపట్టారు. విషయం తెలుసుకున్న నిర్వాహకుడు తన సోదరుడు కౌన్సిలర్‌ను వెంటబెట్టుకొని కార్యాలయం వద్ద వాగ్వాదానికి దిగాడు. ఈ విషయంపై ఎవరెవరికి ఎంత నగదు ముట్ట చెప్పింది తన వద్ద లెక్కలున్నాయని బహిరంగంగా విమర్శించారు. ఈ విషయంపై కమిషనర్‌ సమాధానం చెప్పకుండా అక్కడనుండి జారుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్య ప్రజా ప్రతినిధి వద్దకు ఈపంచాయతీ వెళ్లింది.ఆ నేత మనోడే అని సరి చేస్తారా లేదా లెక్క తేలుస్తారా అన్నది తేలాల్సుంది.