Feb 07,2023 22:37

లేపాక్షి ఆలయం విశేషాలను తెలుసుకుంటున్న జి-20 ప్రతినిధులు

         లేపాక్షి : లేపాక్షిలో జి-20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్నాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు విచ్చేశారు. ముందుగా లేపాక్షి ఆలయం వద్దకు చేరుకున్న 29 మంది జి-20 విదేశీ ప్రతినిధులకు కలెక్టర్‌ పి.బసంత్‌ కుమార్‌, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్తీక్‌, ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అమరావతి సర్కిల్‌ ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా ఆర్కియాలజిస్టులు సూర్యప్రకాష్‌, కమలహాసన్‌లు లేపాక్షి ఆలయ ప్రాశస్త్యం, చరిత్ర, దేవాలయ నిర్మాణం, కట్టడాలు, సభా మండపం, విజయనగర సామ్రాజ్యంలో ఆలయానికి ఉన్న ప్రాధాన్యత, శిల్ప సంపద, సీతమ్మ పాదం, భోజనశాల, వేలాడే స్తంభం, 680 స్తంభాలు తదితర వివరాలను తెలియజేశారు. వీటి గురించి తెలుసుకున్న విదేశీ ప్రతినిధులు ఆలయం అద్భుతం అని కొనియాడారు. ముఖ్యంగా వేలాడే స్తంభాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏకశిలా గణేషుడు, నాగలింగం విశిష్టత, శిల్పకళా సంపద, చరిత్ర గురించి తెలుసుకున్నారు. లేపాక్షి ఆలయం సందర్శన సందర్భంగా తిలకించిన దశ్యాలను వారి సెల్‌ఫోన్‌లలో బంధించారు. అనంతరం లేపాక్షి ఆలయం నుంచి బయలుదేరి వెళ్లి అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహాన్ని తిలకించారు. లేపాక్షి పర్యటన సందర్భంగా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి సర్కిల్‌ ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా సూపరింటెండెంట్‌ డా||గోపీనాథ్‌ జన, డివైఎస్‌ఏఈ కె.వీరాంజనేయులు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌లు డివి.బోయి, పి.శ్రీనివాసరావు, ఏ.భానుప్రకాష్‌ వర్మ, అనంతపురం సర్కిల్‌ ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌ పి.బాలకష్ణారెడ్డి, ఏఎస్పీ రామకష్ణ ప్రసాద్‌, డీఎస్పీలు భవ్యకిషోర్‌, టిడి.యశ్వంత్‌, పాల్గొన్నారు.