Feb 06,2022 12:15

క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. తమకు జరిగిన అన్యాయం గురించి అమ్మాయిలు మీడియా ముందుకొచ్చి చెప్తూనే ఉన్నారు. అందులో కొందరు స్టార్‌ హీరోయిన్లు కూడా ఉన్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే ఇండిస్టీకి వస్తున్న వర్ధమాన నటీమణులూ ఉన్నారు. మరికొందరు బ్లాక్‌బస్టర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కాంప్రమైజ్‌ కాలేక వెనకబడిన వాళ్లూ ఉన్నారు. అయితే ఈ మధ్యే మరో హీరోయిన్‌ నర్గీస్‌ ఫక్రీ కూడా ఓ ఇంగ్లీష్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ఓపెన్‌ అయ్యారు. మరి ఆమె పంచుకున్న ఆ విశేషాలేంటో తెలుసుకుందాం !

పేరు : నర్గీస్‌ ఫక్రీ
వృత్తి : యాక్ట్రస్‌, మోడల్‌, సింగర్‌
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 20, 1979
పుట్టిన ప్రాంతం : న్యూయార్క్‌, అమెరికా
చదువు : బిఎ, ఫైన్‌ ఆర్ట్స్‌, సైకాలజీ
హాబీస్‌ : గార్డెనింగ్‌, ట్రావెలింగ్‌, యోగ
తల్లిదండ్రులు : మొహ్మద్‌ ఫక్రీ, మారీ ఫక్రీ
సోదరి : ఆలియా

రిగ్గా పదేళ్ల క్రితం ఇంతియాజ్‌ అలీ తెరకెక్కించిన రాక్‌ స్టార్‌ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు నటి నర్గీస్‌ ఫక్రీ. అయితే ఈమె ఇండియన్‌ కాదు. పుట్టింది అమెరికాలో అయినా, మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి ఇండియాకు తీసుకొచ్చారు ఇంతియాజ్‌ అలీ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి నర్గీస్‌. అయితే నటి నర్గీస్‌ ఫక్రీ న్యూయార్క్‌ నగరంలో పుట్టి, పెరిగినప్పటికీ బాలీవుడ్లో సినీ అవకాశాలతో పాటు మోడలింగ్‌ రంగంలోనూ అవకాశాలు రావడంతో భారతదేశానికి వచ్చారు. దీంతో ప్రస్తుతం పలు స్పెషల్‌ సాంగ్స్‌ మరియు చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని, పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో భాగంగా అందరి నటీనటుల మాదిరిగానే తాను కూడా సినిమా ఇండిస్టీకి వచ్చిన సమయంలో అవకాశాల కోసం పలు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగానని, దీంతో కొంతమంది దర్శక నిర్మాతలు అవకాశాల పేరుతో తనని లొంగదీసుకోవాలని చూశారని తెలిపారు. ఈ క్రమంలో మరికొందరైతే ఏకంగా తమకి పడకగది కమిట్మెంట్లు ఇస్తే తాము దర్శకత్వం లేదా నిర్మాతగా వ్యవహరించే చిత్రాల్లో వరుసగా అవకాశాలు ఇస్తామని ఆఫర్లు ఇచ్చారని తెలిపారు.
    'మద్రాస్‌ కేఫ్‌, మై తేరా హీరో, గూఢచారి, హౌజ్‌ ఫుల్‌' లాంటి సినిమాలు మినహాయిస్తే తనకు పెద్దగా అవకాశాలు రాలేదని, అయితే స్టార్‌ కావాల్సిన తనను కొందరు కావాలనే తొక్కేశారంటూ ఆ మధ్య కాలంలో సంచలన ఆరోపణలూ చేశారు నర్గీస్‌. బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే కచ్చితంగా దర్శక, నిర్మాతలు కోరిక తీర్చాల్సిందే అని.. అలా తనను కూడా కొందరు దర్శకులు, నిర్మాతలు నేరుగానే అడిగినట్లు తెలిపారు. తను ఇండిస్టీకి వచ్చినపుడే కాంప్రమైజ్‌ కాకూడదని, నగంగా నటించకూడదని ఫిక్స్‌ అయ్యి వచ్చానని చెప్పుకొచ్చారు నర్గీస్‌ ఫక్రీ. అందుకే కొందరు దర్శక, నిర్మాతలు తాము చెప్పినట్లు వింటే మంచి అవకాశాలు ఇస్తామని చెప్పినా ఒప్పుకోనని ఖరాకండీగా చెప్పినట్లు తెలిపారు నర్గీస్‌ ఫక్రీ. తను వాళ్ల మాట వినలేదు కాబట్టే కొందరు మనసులో పెట్టుకుని, తనకు అవకాశాలు రాకుండా తొక్కేశారని తెలిపారు. అయితే కొన్ని పనులు చేయకూడదని ముందు నుంచీ అనుకోవడం వల్లే తాను స్టార్‌ కాకుండా మిగిలిపో యానంటున్నారు ఈ కథానాయిక.
 

బ్లాక్‌బస్టర్‌తో అవకాశాలు కామన్‌..
సాధారణంగా బ్లాక్‌బస్టర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌కు వరుస అవకాశాలు రావడం కామన్‌. ఏ ఇండిస్టీ అయినా మొదటి సినిమాతోనే విజయం అందుకున్న నటీమణులను బాగానే చూసుకుంటుంది. ఆఫర్స్‌ కూడా బాగానే ఇస్తుంటారు. కానీ తన విషయంలో మాత్రం దర్శక, నిర్మాతలు అలా చేయలేదని వాపోయారు నర్గీస్‌ ఫక్రీ. తాను నటించిన సినిమాలన్నీ విజయం సాధించినా అవకాశాలు అందుకే ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇండిస్టీలో చాలా ఉందని.. పడుకోకపోతే ఇక్కడ పనులు జరగవు అంటూ ఓపెన్‌గానే చెప్పేశారు.
 

ప్రతిభను నమ్ముకునే వచ్చా..
'సినిమా ఇండిస్టీకి నా టాలెంట్‌ని నమ్ముకొని వచ్చాను. అంతే తప్ప శరీరం అమ్ముకొని వచ్చేటువంటి ఆఫర్లు నాకు ఏమాత్రం వద్దని మొహం మీదే చెప్పేసి వచ్చేశాను. అలాగే సినిమా ఇండిస్టీ అన్న తర్వాత ఇలాంటి విషయాలు జరగడం కామన్‌. అంతేకాక సినిమా ఇండిస్టీలో వచ్చేటువంటి నటీనటులు కూడా అందం, గ్లామర్‌ కలిగి ఉంటారని, అందువల్లనే ఈ మధ్యకాలంలో ఆడవాళ్లతో పాటు మగవాళ్లకి కూడా ఈ లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి' అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరైనా సరే ఓపికతో తమ ప్రతిభను నమ్ముకుని అవకాశాల కోసం ప్రయత్నిస్తే కచ్చితంగా మంచి సినీ భవిష్యత్తు ఉంటుందని, అలాకాకుండా అడ్డదారుల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తే కచ్చితంగా ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచించారు.