Feb 06,2023 21:47

ర్యాలీ నిర్వహిస్తున్న ఐద్వా నాయకులు

ర్యాలీ నిర్వహిస్తున్న ఐద్వా నాయకులు
లైంగిక దాడులు అమానుషం
-నాగరాజును తక్షణమే అరెస్టు చేయాలి
-రూ. 25 లక్షల ఏక్స్‌గ్రేషియగా మేఘన కుటుంబానికి అందజేయాలి
నెల్లూరు :రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనర్‌ బాలికలపై, మహిళలపై లైంగిక దాడులు అధికంగా చోటు చేసుకుంటున్నాయని, సభ్యసమాజం సిగ్గుతో తలవొంచుకొనే విధంగా అత్యాచారాలు, లైంగిక దాడులు చోటు చేసుకోవడం అమానుషమంటూ ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు పేర్కొన్నారు.బుజబుజనెల్లూరు హైస్కూల్‌లో 9వ తరగతి చదువుకుంటున్న బండారు మేఘన అనే బాలికపై వరసకు మేనమామ అయిన నాగరాజు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా యాసిడ్‌ దాడి చేయడంతో వైద్యచికిత్సలు తీసుకుంటూ మృతి చెందినది. ఈ బాలిక మృతికి నిరసనగా యాసిడ్‌ దాడికి పాల్పడిన నాగరాజు అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియాగా రూ.25 లక్షలు అందజేయాలంటూ సోమవారం నగరంలోని విఆర్‌సి క్రీడా మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు మహిళలు, విద్యార్ధులు బారీ స్థాయిలో నిరసన ర్యాలీ చేపట్టారు. నిరసన ర్యాలీని నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు మాట్లాడుతూ మహిళల, బాలికలపై ఇంటా బయట, పని ప్రదేశాలల్లో అధికంగా లైంగిక వేదింపులు, అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. 6 నెలల వ్యవధిలోనే నగరంలో ప్రయివేట్‌ పాఠశాలలైన ఓవెల్‌,నక్షత్రం పాఠశాలల్లో చిన్నారులపై లైంగిక దాడులు జరగగా విద్యార్ధి, యువజ, మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌ నెలలో బుజబుజ నెల్లూరు హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివే బండారు మేఘన అనే మైనర్‌ బాలిక పైన మేనమామ అయినటువంటి నాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికపైన లైంగిక దాడికి పాల్పడి తదుపరి యాసిడ్‌ దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దాడిలో తీవ్ర గాయాలు అయిన మేఘన నగరంలో చికిత్సలు తీసుకుంటూ మెరుగైన వైద్యం కోసం చెన్నరు అపోలో హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ ఫిబ్రవరి ఒకటో తేదీన మరణించిందన్నారు. మేఘనా కుటుంబానికి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని, ఎక్స్‌గ్రేషియాగా రూ.25 లక్షలు అందజేయాలని కోరారు. ఇటువంటి దాడికి పాల్పడిన నాగరాజుని కఠినంగా శిక్షించాలని. విద్యార్థి. యువజన. మహిళా సంఘాలు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం మద్యాన్ని దశల వారీగా అరికడతామని ఆర్బాటంగా హామీలు చేసినప్పటికీ అందుకు తగిన విధంగా ఎటువంటి చర్యలు తీసుకోక పోగా మద్యాం అమ్మకాలు ఎక్కువ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. అంతే కాకుండా ఇటీవల కాలంలో నగరంలో మాదకద్రవ్యాల అమ్మకాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయన్నారు. వీటన్నింటి కారణంగా మహిళలపై, బాలికలపై లైంగిక వేదింపులు, అత్యాచారాలు అధికమౌతున్నాయని, వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో మహిళా విద్యార్థులు పాల్గొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో ఐద్వా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మస్తాన్‌భీ, టి.శివకుమారి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి.రమణ, బి.నరసింహా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, హర్షా , అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.