Jul 12,2022 23:29

ప్రజాశక్తి - కంచికచర్ల : మండల కేంద్రమైన కంచికచర్లలో నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. వీటిని కొనుగోలు చేస్తే ప్రైజ్‌ మనీ పడుతుందని అమాయకులను ప్రలోభపెట్టి వీటి విక్రయదారులు సొమ్ము చేసుకుంటున్నారు. చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, లారీ డ్రైవర్లు, తాపీమేస్త్రీలు, రోజువారి కూలీలు లాటరీ టికెట్ల కొనుగోలుకు రోజు వారీ సంపాదనలో సగానికిపైగా లాటరీ టికెట్ల కొనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. తీరా ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు. రోజువారీ సంపాదనలో కొంత లాటరీ టికెట్ల కొనుగోలుకు ఖర్చు చేయటం వల్ల ఒక్కోసారి కుటుంబ పోషణకు చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి కుటుంబాలు చిన్నాభిన్నమైన సంఘటనలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నందిగామ, కంచికచర్ల ప్రాంతంలో లాటరీ టికెట్లను వ్యసనంగా కొనుగోలు చేస్తూ ఎలాంటి ప్రైజ్‌ మనీ పడకపోవటంతో అప్పుల పాలై కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
రోజూ వేలల్లో వ్యాపారం
కంచికచర్ల ప్రాంతం కేంద్రంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం ప్రతి రోజూ వేల రూపాయల్లో సాగుతోంది. పలువురు టికెట్ల విక్రయమే ప్రధాన వృత్తిగా చేసుకున్నారు. ఈ ప్రాంతాల్లో సుమారు 25 మంది వరకు రోజూ ఉదయం 6 గంటల నుండే లాటరీ టికెట్ల నెంబర్లను సామాన్యులకు అట్టకట్టేపనిలో నిమగమవుతున్నారు. కేరళ, బెంగుళూరు, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన నల్లనేరం, తంగం, కుమ్మారన్‌, విష్ణు, ధనలకీë, తదితర కంపెనీల లాటరీలు గతంలో టికెట్ల రూపంలో వచ్చేవి. అయితే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో టికెట్ల నెంబర్ల బుకింగ్‌ కూడా ఆన్‌లైన్‌ ద్వారానే జరుగుతోంది. విక్రయదారులు తమకు నచ్చిన నెంబర్లను ఆన్‌లైన్లో బుకింగ్‌ చేసుకొని వాటిని ఇక్కడ కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. 6 నెంబర్లు గల ఒక్కో టికెట్‌ రూ.80, రూ.160, రూ.300, రూ.422, రూ.920 చొప్పున అమ్ముతున్నారు. అయితే అప్పడప్పుడూ చిన్న చిన్ని ప్రైజులు పడటం మినహా పెద్ద ప్రైజులు పడటం చాలా అరుదుగా ఉంటుందని పలువురు కొనుగోలుదారులు చెబుతున్నారు. అధికారులెవరూ పట్టించుకోకపోవటంతో ఈ వ్యాపారం మూడుపువ్వలు ఆరు కాయలుగా విస్తరిస్తోంది.
ప్రైజ్‌ మనీ పడ్డా కమీషన్‌ పేరుతో దోపిడీ
అదృష్టం కొద్దీ ఒక్కోసారి ఎవరికైనా ప్రైజ్‌ మనీ పడితే అందులో 50 శాతం కమీషన్‌ పేరుతో విక్రయదారులే తీసుకుంటున్నారు. ఒక్కోసారి టికెట్‌ కొనుగోలు దారుడికి ప్రైజ్‌మనీ పడిన విషయాన్ని విక్రయదారులు తెలియజేకుండా వారే తీసుకుంటున్నట్లు కొనుగోలు దారులు చెబుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి ప్రైజ్‌ మనీ పడిన విషయం అలస్యంగా తెలిసింది. దీనిపై టికెట్‌ విక్రయదారుడిని అడిగితే...''ఎలాంటి ప్రైజ్‌ మనీ పడలేదని'' ముఖం చాటేయటంతో ఆ ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది.
లాటరీ టికెట్లు విక్రయిస్తే చర్యలు
ఎసిపి నాగేశ్వరరెడ్డి
నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం నిర్వహించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నందిగామ ఎసిపి నాగేశ్వరరెడ్డి హెచ్చరించారు. గతంలో లాటరీ టికెట్లు విక్రయించిన వారిపై కేసులు నమోదు చేశామని గుర్తుచేశారు. లాటరీ టికెట్ల విక్రయదారులపై నిఘా ఏర్పాటు చేసి పట్టుకోవటంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.