Sep 24,2023 16:34

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కొరటాల సత్యనారాయణ  జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ. గఫూర్ అన్నారు. ఆదివారం
కార్మిక కర్షక భవనంలో సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.యస్.రాధాక్రిష్ణ అధ్యక్షతన జరిగిన కొరటాల సత్యనారాయణ శతజయంతి సభలో  ముందుగా కొరటాల  చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఏం.ఎ. గపూర్  మాట్లాడుతూ 1923 సెప్టెంబర్ 24వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పేపర్ గ్రామంలో బుచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు. కొరటాల  పుట్టిన కుటుంబం భూస్వామి కుటుంబమైన నిత్యం పేదల పక్షాన కష్టజీవులతో మమేకమై పనిచేశారు,. గుంటూరు ఏసీ కళాశాలలో చదివేటప్పుడు విద్యార్థి సమస్యలపై పోరాటంలో ముందుకు వచ్చారు. ఆ తర్వాత చదువుకు స్వస్తి చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుందరయ్య, బసవ పున్నయ్య  వంటి నాయకులతో కలిసి పని చేశారు, గ్రామీణ పేదలు కష్టజీవుల యొక్క బాధలు తెలుసుకొని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని వారికోసం కూలిపోరాటం నిర్వహించారు. రైతుల సమస్యలు వస్తే ప్రధానంగా పత్తి రైతుల పోరాటాన్ని నిర్వహించారు, రేపల్లె ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల వారి సమస్యలు తెలుసుకుని చేనేత సంఘాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఆ విధంగా నిత్యం చిన్న, పెద్ద అనేటువంటి లేకుండా కార్యకర్తలతో అరే బాబు అంటూ ఆప్యాయంగా పలకరించే కొరటాల నేటి తరానికి ఎంతో ఆదర్శమని ఆయన అన్నారు. కొరటాల ప్రజా ఉద్యమాలు చేస్తూనే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేశారు. రెండుసార్లు శాసనసభ సభ్యులుగా పని చేశారు. నేటి తరం కార్యకర్తలు నాయకులు కొరటాల ను ఆదర్శంగా తీసుకొని ఏ బాధ్యత అప్పజెప్పిన దాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించి పని చేసినప్పుడే ఆయన ఆశయ సాధన కోసం పని చేసిన వారం అవుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.రామాంజనేయులు, పి.నిర్మల, కె.వి నారాయణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి.అంజిబాబు, ఎం. రాజశేఖర్, నాయకులు సాయిబాబా, నరసింహులు, రఫీ, రాఘవేంద్ర, వివిధ సంఘాల, రంగాల కార్యకర్తలు పాల్గొన్నారు.