Apr 09,2022 16:33
  • ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి ఇది దోహదం

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : సీపీఎం నేతృత్వంలో కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం అద్భుతమైన విజయాలను సాధించటం పట్ల ఆ పార్టీ 23వ అఖిల భారత మహాసభ హర్షం వ్యక్తం చేసింది. ఆయా విజయాలకు జేజేలు పలుకుతూ మహాసభలో తీర్మానించారు. ఇవి ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు, బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ''2016 నుంచి ఇక్కడ అధికారాన్ని కొనసాగించటం అభినందనీయం. కేరళ ప్రజానీకం పార్టీకి, ప్రభుత్వానికి అండదండలనిస్తూ ఈ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.'' అని మహాసభ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.
'2016లో యూడీఎఫ్‌ నుంచి ఎల్డీఎఫ్‌ అధికారాన్ని చేజిక్కించుకున్న సమయంలో రాష్ట్రం అనేక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. వ్యవసాయరంగం ప్రతికూల వృద్ధిలో ఉంది. పరిశ్రమల కల్పనలో స్తబ్దత, ఉపాధి కల్పన మందకొడి వంటి సమస్యలున్నాయి. అవినీతి పెద్దఎత్తున పేరుకుపోయింది. రాజకీయాల్లోకి మతాన్ని జప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ఎల్డీఎఫ్‌... కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా స్థిరమైన ఆర్థిక ప్రణాళికలతో ముందడుగేసింది. మానవాభివృద్ధి సూచికలను మెరగుపరచటమే ప్రాతిపదికగా, ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా పని చేసింది. ముఖ్యంగా యువతకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో ఆదాయాలను పెంచేందుకు కృషి చేసింది. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీటేసింది...' అని తీర్మానంలో పేర్కొన్నారు.
అయితే 2016-21 కాలంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం... ఒకదాని తర్వాత ఒకటిగా వరుస సవాళ్లను ఎదుర్కొన్నదని మహాసభ తన తీర్మానంలో వివరించింది. '2017లో ఓక్చి తుపాను, 2018, 2019లో అతివృష్టి వల్ల తలెత్తిన వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. 2018లో రెండు జిల్లాలకు నిఫా వైరస్‌ సోకటంతో ప్రజలు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టటంతో ఈ దుస్థితి మరింత ఎక్కువైంది. 2019లో కోవిడ్‌ మూలంగా కేరళ ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూరుకుపోయింది. కేంద్రంలోని మోడీ సర్కారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను దారుణంగా దెబ్బతీసింది. రాష్ట్రాలకు, ముఖ్యంగా కేరళకు నిధులు కేటాయించకుండా వివక్షను ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో ఎల్డీఎఫ్‌ సర్కారు... సవాళ్లను ఎదుర్కొంటూనే ఆర్థికపరంగా స్వల్ప, మాధ్యమిక, దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవటం ద్వారా ముందడుగేసింది. ప్రభుత్వ విద్యారంగంలో మౌలికమైన మార్పులను తేవటంతోపాటు పిల్లలందరికీ నాణ్యమైన విద్యనందించటం, పేదలందరికీ ఇళ్లు కట్టించటం, విద్యారంగంలో సమూల మార్పులు తేవటం ద్వారా ప్రజల మన్ననలను పొందింది. పారదర్శక పాలన, అందరికీ అన్ని రంగాల్లో సమానావకాశాలను కల్పించటం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. స్థానిక సంస్థల్లో అందరికీ భాగస్వామ్యం, ఐటీ రంగంలో నూతన విధానాలు, ఉపాధి అవకాశాలను కల్పించటం వల్ల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచటం, వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలను వృద్ధి చేయటం, లింగ వివక్ష లేకుండా చూడటం, సామాజికంగా రక్షణ కల్పించటం తదితర చర్యలతో ఎల్డీఎఫ్‌ ప్రజల మనసులను గెలుచుకుంది. ఇలాంటి చర్యలతో ప్రతిపక్షమైన యూడీఎఫ్‌కు, బీజేపీకి గట్టి సమాధానం చెప్పగలిగింది...' అని మహాసభ తీర్మానంలో పేర్కొంది. తద్వారా ఎల్డీఫ్‌ కేరళతోపాటు జాతీయ, ప్రపంచ స్థాయిలోని లెఫ్ట్‌, కమ్యూనిస్టు ఉద్యమాలకు బలాన్ని చేకూర్చిందంటూ ప్రశంసించింది.

అన్నిచోట్లా వారే .. చిరు నగవుల హుషారే ... మహాసభలో రెడ్‌ షర్టు వాలంటీర్ల సందడి

  • అన్నిచోట్లా వారే .. చిరు నగవుల హుషారే... - మహాసభలో రెడ్‌ షర్టు వాలంటీర్ల సందడి

సీపీఎం 23వ మహాసభ ప్రారంభమైన ఈనెల ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకూ అటు ప్రతినిధులు, ఇటు పత్రికా ప్రతినిధుల దృష్టిని ఒక బృందం అదే పనిగా ఆకర్షిస్తోంది. తమకే సొంతమైన ఆహార్యంతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరికీ సేవలందిస్తూ.. అవసరమైనప్పుడల్లా స్పందిస్తూ అందరితో 'భేష్‌... శభాష్‌...' అనిపించుకుంటోంది. అదే రెడ్‌షర్టు వాలంటీర్ల బృందం. పార్టీ పట్ల వారికున్న అంకితభావానికి, బాధ్యతకు ముచ్చటపడ్డ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌, కేరళ సీఎం పినరయి విజయన్‌ తదితరులు ఆ బృంద సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. విరామ సమయాల్లో వారితో ముచ్చటించారు.
మహిళలు, పురుషులతో కూడిన ఈ వాలంటీర్ల బృందం మహాసభ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతినిధుల సభ ప్రారంభ సూచికగా ఈనెల అరుణ పతాకాన్ని ఎగరేసినప్పుడు వారు చేసిన కవాతు అదరహో అనిపించింది. ఆ బృందానికి తోడుగా బ్యాండ్‌ ట్రూప్‌ సంగీతం ఆ సన్నివేశాన్ని మరింతగా రక్తి కట్టించింది. ఆ తర్వాత ప్రతినిధులకు కావాల్సిన కాయితాలు, తీర్మానాల ప్రతులు, మంచినీళ్లను అందించటంతోపాటు ఇతరత్రా అనేక సమయాల్లో వారు అందిస్తున్న సేవలను ప్రశంసనీయం. కన్నూరు జిల్లాలో మొత్తం 25 వేల మందితో రెడ్‌ షర్టు వాలంటీర్ల బృందం ఉందని మహాసభలో ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న కృష్ణన్‌ తెలిపారు. మహాసభ ముగింపు, బహిరంగ సభ సందర్భంగా వీరిలో రెండు వేల మందితో ఎర్రదండు కవాతు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.