May 22,2022 11:03

సుమకు యాంకర్‌గా ఉన్న పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాంకర్‌ కావడానికి ముందు ఆమె నటి అనే విషయం జనాలకు ఇప్పుడు గుర్తు లేకపోవచ్చు. సినిమాల్లోనే కాక సీరియళ్లలోనూ నటించారు సుమ. యాంకర్‌గా ఆమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు అసామాన్యం. ఆ ఇమేజ్‌తోనే రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వచ్చిన సుమ.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ నటన వైపు అడుగులు వేశారు. తాజాగా 'జయమ్మ పంచాయితీ' చిత్రం విడుదల సందర్భంగా ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు..

suma family


బుల్లితెర యాంకర్లకు డిక్షనరీ లాంటి యాంకర్‌ సుమ. ఎంతమంది యాంకర్లు వచ్చినా.. సుమ వాక్చాతుర్యం, సమయస్పూర్తి ముందు వీళ్లంతా దిగదుడుపే. సుమ చేతిలో మైక్‌ పెట్టారంటే ఆ ప్రోగ్రామ్‌ హిట్‌ అని ఫిక్స్‌ అయిపోవాల్సిందే. వేలాది కార్యక్రమాలను హోస్ట్‌ చేసి, బుల్లితెరపై తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నారు సుమ. కేరళకు చెందిన సుమ తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉన్నారు. ఆ సమయంలో దేవదాస్‌ కనకాల దర్శకత్వం వహించిన 'మేఘమాల' సీరియల్‌లో చేస్తుండగా రాజీవ్‌ కనకాలతో పరిచయమైంది. వీరి వివాహం 1999లో జరిగింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో 'జయమ్మ పంచాయితీ' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజరు కలివరపు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. శ్రీకాకుళం నేపథ్యంలో, పూర్తిగా అక్కడి నేటివిటీతో నడిచే విలేజ్‌ డ్రామా ఇది. కొంచెం వైవిధ్యమైన కథాంశంతో కామెడీ, ఎమోషన్లు ప్రధానంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు. కాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు.

suma 3


ఆ స్లాంగ్‌ కోసం ప్రాక్టీస్‌ చేశా..
సుమ బాగా యాక్ట్‌ చేసిందని మెచ్చుకుంటారే కానీ నిరుత్సాహపడరనే నమ్మకం ఉంది. ఒకసారి సినిమా స్టార్ట్‌ అయ్యాక అందరూ క్యారెక్టర్స్‌తో ట్రావెల్‌ చేస్తారు. ఎందుకంటే సుమ గురించి ఊహించకుండా విజరు రాసిన కథ ఇది. ఇందులో నేనే కనిపించలేదు. జయమ్మే కనిపించింది. ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నప్పుడు ఎవరూ వేలెత్తి చూపకూడదు. అందుకే శ్రీకాకుళం స్లాంగ్‌ కోసం చాలా ప్రాక్టీస్‌ చేశాను. ఈ 'పంచాయితీ' హిట్‌ అయితే మరో పంచాయితీ ఉంటుంది. నా తర్వాతి ప్రాజెక్ట్‌ కోసం రెండు కథలు ఉన్నాయి. ఇలాంటి మంచి కథలు వస్తే తప్పకుండా చేస్తాను.
ఆ రోజు గుండె పిండేసినట్లయ్యింది..
నా కుమార్తెకు ఏడెనిమిదేళ్లు ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండి, వరుసగా మూడు రోజులు కనిపించలేదు. ఆ సమయంలో 'నిన్ను టీవీలోనే చూడాలా అమ్మా..?' అని నా కూతురు అడిగింది. ఆ రోజు గుండె పిండేసినట్లయింది. మధ్యలో చాలా అవకాశాలు వచ్చినా వదిలేశాను. ప్రస్తుతం తనకు 16 ఏళ్లు. తన ఆలోచనా ధోరణిలో పరిణతి వచ్చింది. ఒక అమ్మగా నాకు చాలా వెసులుబాటు ఉంది. ఇప్పుడు మా అమ్మాయి పదో తరగతికి వచ్చింది. తన పని తను చేసుకోగలుగుతుంది కాబట్టి నేను కొంచెం బయటకు రాగలుగుతున్నాను. టీవీ పరిశ్రమలో మనం వచ్చామా, మన పని చేసుకున్నామా, టైమ్‌, వేరే వాళ్ల కోసం వెయిటింగ్‌ లాంటివి లేకుండా ఆరు గంటలకు ప్యాకప్‌ చెప్పామా, వెళ్లిపోయామా అన్నట్లు హాయిగా ఉంది జీవితం. నా కొడుకు రోషన్‌కి చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే ఆసక్తి. ఈ ఏడాది తనని లాంచ్‌ చేస్తాం.
అవి నచ్చే ఈ సినిమా చేశా!
కులాలకు సంబంధించిన అంశాలు, మూఢనమ్మకాలు, మహిళల పట్ల వివక్ష వంటి అంశాలను విజరుగారు ఈ చిత్రంలో ప్రస్తావించారు. ఆ అంశాలు నచ్చి. నన్ను ఈ సినిమా చేసేలా చేశాయి. కథ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. డిఫరెంట్‌గా ఉంది. ఒక ఉమెన్‌ క్యారెక్టర్‌ని తీసుకొని దాంతోపాటే స్టోరీని లీడ్‌ చేసే కథ. ఈ తరహా కథలు చాలా తక్కువ వస్తాయి. అలాంటి కథలు నా దగ్గరికి మరీ తక్కువ వచ్చాయి.
ఇప్పటి వరకూ ఆ ఆలోచనే రాలేదు..
ఈ మధ్య కాలంలో తన వివాహ బంధంపై వచ్చిన రూమర్లపై ఈ సందర్భంగా స్పందించారు. అసలు పెళ్లి అనేదే ఒక పంచాయితీ. మా ఇద్దరి పంచాయతీ మొదలై 23 సంవత్సరాలైంది. ఈ 23 ఏళ్లలో ఎన్ని గొడవలో. మొగుడుపెళ్లాం అన్న తరువాత కచ్చితంగా చిన్న చిన్న గొడవలు వస్తాయి. రోజులో కనీసం 2, 3 సార్లు అవుతాయి. అవన్నీ సహజం. కానీ, వెబ్‌సైట్స్‌ వాళ్లు మేము విడాకులు తీసుకున్నట్లు రాసేశారు. అలాంటిది ఏమీ లేదు. మేము కలిసే ఉన్నాం. మేము ఆనందంగా ఉన్నాం. అలాంటి వార్తలు చూసి బాధపడ్డాను. కానీ ఎక్కడా ఏమీ చెప్పలేదు. ఈ టాపిక్‌ గురించి మొదటిసారి ఇక్కడే స్పందిస్తున్నాను. భార్యభర్తలు విడాకులు తీసుకోవడం చాలా సులభం కానీ, అమ్మనాన్నలుగా ఉన్నప్పుడు అది చాలా కష్టం. పిల్లలు, కుటుంబం అన్నది ఒక బాధ్యత. అసలు ఇప్పటివరకూ మాకు విడాకుల ఆలోచన రాలేదు. ఇకపై రాదు కూడా.

 

పేరు : సుమ కనకాల
పూర్తిపేరు : పల్లెశెన పాచివిటల్‌ సుమ
పుట్టిన తేదీ: 1974, మార్చి 22
పుట్టిన ప్రాంతం : కేరళ
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
భర్త : రాజీవ్‌ కనకాల
పిల్లలు : రోషన్‌ కనకాల, మనస్విని కనకాల
తల్లిదండ్రులు : పి.ఎస్‌.కుట్టి, విమల