కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్
కుష్టు నివారణకు పటిష్ట చర్యలు
నెల్లూరు:జిల్లాలో కుష్టు వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ ఎస్ ఆర్ శంకరన్ వి.సీ. హాల్లో మహాత్మా గాంధీ వర్ధంతి - అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధి వ్యతిరేక దినాన్ని నిర్వహించారు. తొలుత కలెక్టర్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధి, క్షయ వ్యాధి నివారణకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు, కుష్టు,క్షయ వ్యాదులపై అవగాహన కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టడంతో పాటు విరివిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలలో కుష్టు, క్షయ వ్యాధుల నివారణకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు, చికిత్సలు చేపట్టాలన్నారు. అలాగే అన్ని విద్యాసంస్థల్లో కూడా కుష్టు, క్షయ వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని తద్వారా విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోగ్యంపై దష్టి కేంద్రీకరించే అవకాశం ఉందన్నారు.గ్రామాల్లో విరివిగా గ్రామసభలు సర్పంచ్లు ఆధ్వర్యంలో నిర్వహించి వ్యాధుల నివారణ పై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారిని పరీక్షించి తగిన విధంగా చికిత్స చేయాలన్నారు.అంతకు మునుపు జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధి వివరాలు కలెక్టర్ కు వివరించారు.అనంతరం కలెక్టర్ కుష్టు వ్యాధి నివారణ పై అవగాహన కలిగించే కరపత్రాలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పెంచలయ్య, జెడ్పీ సీఈవో చిరంజీవి,డిఆర్డిఏ పిడి కే సాంబశివారెడ్డి, ఐసిడిఎస్ పిడి సౌజన్య తదితర అధికారులు పాల్గొన్నారు.










