Apr 12,2022 21:03

ఆందోళనలో 87% కుటుంబాలు
వంట సరుకుల ధరలపై ఆవేదన
లోకల్‌ సర్కిల్స్‌ సర్వే వెల్లడి
హైదరాబాద్‌ : 
దేశంలో అమాంతం పెరుగుతోన్న ధరలపై జనం భగ్గుమంటున్నారు. గత 30 రోజులుగా పెరిగిన కూరగాయల ధరల పట్ల ప్రతీ 10 గృహాల్లో తొమ్మిది కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయని లోకల్‌ సర్కిల్స్‌ సర్వేలో వెల్లడయ్యింది. దేశ వ్యాప్తంగా 311 జిల్లాల్లో 11,800 మందిని ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో 87 శాతం కుటుంబాలు తాము మార్చి నుంచి పెరిగిన అధిక ధరలతో ప్రభావితం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశాయి. కూరగాయాలపై తాము 25 శాతం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని 37 శాతం కుటుంబాలు అభిప్రాయపడ్డాయి. క్రితం నెలలో కొన్ని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని తమ సర్వేలో తేలిందని లోకల్‌ సర్కిల్స్‌ తెలిపింది.

గడిచిన నెల నుంచి కూరగాయలపై తాము 10-25 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తుందని 36 శాతం మంది పేర్కొన్నారు. మరో 14 శాతం మంది 0-10 శాతం ధరలు పెరిగాయన్నారు. తాము ఏకంగా 25-50 శాతం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని 25 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఐదు శాతం మంది మాత్రం ఏకంగా ధరలు 50-100 శాతం పెరిగాయన్నారు. రెట్టింపు పైగా ధరలు ఎగిశాయని ఏడు శాతం మంది వాపోయారు. కాగా.. ధరల్లో ఎలాంటి మార్పులు లేవని 4 శాతం మంది అన్నారు. 2 శాతం మంది ధరలు తగ్గాయన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు ఉన్నారని లోకల్‌ సర్వే తెలిపింది. ఈ సర్వేలో పెద్ద, చిన్నా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత జిల్లాల్లోని వారిని కూడా భాగస్వాములను చేశామని పేర్కొంది.

వంట నూనెల మంట
దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంది. వంట నూనెలు, ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రస్తుత ఏడాది మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 6.95 శాతానికి ఎగిసిందని మంగళవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. గత 17 మాసాల్లో ఇదే అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. ముఖ్యంగా వంట నూనెలు, అహారోత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వరుసగా మూడో నెలలోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగిసింది.
ఇంతక్రితం ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 6.07 శాతంగా చోటు చేసుకుంది. కేంద్ర గణంకాల శాఖ రిపోర్ట్‌ ప్రకారం.. 2022 మార్చిలో వంట నూనెల ధరలు ఏకంగా 18.79 శాతం, కూరగాయల ధరలు 11.64 శాతం చొపున పెరిగాయి. మాంసం, చేపల ధరలు 9.63 శాతం, పాదరక్షలు 9.4 శాతం, ఇంధనం, విద్యుత్‌ ద్రవ్యోల్బణం 7.52 శాతంగా నమోదయ్యింది. పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 8.85 శాతం, ఉత్తర ప్రదేశ్‌, అస్సాంల్లో 8.19 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా.. ఆ తర్వాత స్థానాల్లో మధ్య ప్రదేశ్‌ (7.89%), తెలంగాణ (7.66%), మహారాష్ట్ర (7.62%) రాష్ట్రాలు ఉన్నాయి. దేశంలో నమోదవుతున్న అధిక ధరలు ప్రభుత్వానికి, ఆర్‌బిఐకి సవాళ్లను విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్‌బిఐ ఎంపిసి భేటీలో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.