Jul 04,2022 23:35

ప్రజాశక్తి-విజయవాడ: కుళ్లిపోయి, పురుగులు పట్టి నిల్వ ఉంచి, విక్రయించడానికి గోనె సంచిలో దాచి ఉంచిన 100 కేజిల గొర్రె, మేక మాంసాన్ని నగరపాలక సంస్థ వెటర్నరి అసిస్టెంట్‌ సర్జన్‌ (విఎఎస్‌) డాక్టర్‌ ఎ రవిచంద్‌, వారి సిబ్బందితో దాడి చేసి కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, నిర్వీర్యం చేసి గోతిలో పూడ్చివేసిన ఘటన రాణిగారితోట భూపేష్‌గుప్తా నగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. భూపేష్‌గుప్తానగర్‌ వాటర్‌ ప్లాంట్‌ వద్ద నివాసముంటున్న హరిమాణిక్యం రాము అనే అతను తన తండ్రి ఓబేశ్వరరావు ఇంటిలో గోనె సంచులలో, ధర్మకోల్‌ బాక్స్‌లో కుళ్లిన, పురుగులు పట్టిన గొర్రె, మేక మాంసాన్ని దాచిపెట్టాడు. ఈ విషయాన్ని ముందస్తుగానే పసిగట్టిన నగరపాలక సంస్థ విఎఎస్‌ డాక్టర్‌ రవిచంద్‌ వారి సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. హరిమాణిక్యం రామును అదుపులోకి తీసుకున్నారు. రాము పల్నాడు జిల్లా వినుకొండ గొర్రెల సంతలో చనిపోయిన ఒకో గొర్రె, మేకను రూ.1500 నుంచి రూ. 2 వేల వరకు కొనుగోలు చేసి, వాటి పేగులను తొలగించి, శుభ్రం చేసి, పొట్టలో ఐస్‌ వేసి, ఆ సరుకును విజయవాడకు ఒక ప్రత్యేక వాహనంలో అత్యంత రహస్యంగా తరలిస్తుంటాడు. నగరానికి తీసుకొచ్చిన సరుకును కిలో రూ.800 చొప్పున తనకు బాగా పరిచయం ఉన్న ఐదు షాపులకు విక్రయిస్తుంటాడు.