Jul 07,2021 06:51
  • ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు

ప్రజాశక్తి-అనకాపల్లి (విశాఖ) : విశాఖ జిల్లాలోని అనకాపల్లి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో మంగళవారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌ సైడ్‌ బీమ్‌ పక్కకు జరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న కారు, ఆయిల్‌ ట్యాంకర్‌ నుజ్జునుజ్జుయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొంత మంది క్షతగాత్రులు శిధిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని,అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్మాణసంస్థ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు భావిస్తున్నారు.
     స్థానికుల సమాచారం మేరకు..అనకాపల్లి నుండి ఆనందపురం వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అనకాపల్లి శంకర్‌మఠ్‌ కూడలి వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ పనులను దిలీప్‌ బిల్డ్‌ కాన్‌ సంస్థ చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో నిర్మాణంలో ఉన్న వంతెన సైడ్‌ భీమ్‌ పక్కకు జరిగి కుప్పకూలిపోయింది. బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న కారు, ఆయిల్‌ ట్యాంకర్‌ ధ్వంసమయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో విశాఖ నగరం శ్రీహరిపురానికి చెందిన సతీష్‌ కుమార్‌ (32), సుశాంత్‌ మహంతి(35) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక భాగంలో కూర్చున్న ముగ్గురు మహిళలు స్థానికుల సహాయంతో బయటపడ్డారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలు కాగా, వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్‌, ఆర్‌అండ్‌బి, జాతీయ రహదారి అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. వందల టన్నుల బరువున్న భీమ్‌ ఒక్కసారిగా కూలిపోవడంతో దాని కింద మరికొంత మంది మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. నాసిరకం పనుల వల్లే భీమ్‌ కూలిపోయిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.